పవన్ చేతలకు బాబు ఫిదా

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న శాఖ‌ల‌తోపాటు.. త‌న పార్టీకి చెందిన మంత్రులు నిర్వ‌హిస్తున్న శాఖల విష‌యంలో పెద్ద‌గా ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. కానీ.. ప‌నులు మాత్రం వ‌డివ‌డిగా సాగుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప‌వ‌న్‌కు చెందిన శాఖ‌ల‌ను తీసుకుంటే.. అట‌వీ శాఖ‌లో ఎర్ర‌చంద‌నం వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అన్న విష‌యం తెలిసిందే. అదేవిధంగా మొక్క‌లపెంప‌కం కూడా కీల‌క‌మే. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడుగా ఉన్నారు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలోని 30 వేల అట‌వీ భూముల్లో ఎర్ర‌చంద‌నం విత్త‌నాలు చ‌ల్లేలా కార్యాచ‌ర‌ణ‌ను రెడీ చేస్తున్నారు.

అదేవిధంగా అట‌వీ సంప‌ద చోరీకి గురి కాకుండా.. ప్ర‌త్యేక నిఘాను ముమ్మ‌రం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అలానే అట‌వీ విస్తీర్ణం పెంచేలా మొక్క‌ల పెంప‌కానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. అలానే.. పంచాయ‌తీరాజ్‌లో ర‌హ‌దారులు నిర్మిస్తున్నారు. ప‌శువుల షెడ్ల‌ను నిర్మిస్తున్నారు. వీటికి కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను వినియోగిస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన పార్టీకే చెందిన పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా.. ఇదే త‌ర‌హాలో వ్య‌వహ‌రిస్తున్నారు. రేష‌న్ బియ్యం స్మ‌గ్లింగుకు ముకుతాడు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల బియ్యం గుర్తించేందుకు ప్ర‌త్యేక కిట్‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఇవి స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. వీటితో పాటు ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో మిల్ల‌ర్ల‌తో స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. మొత్తంగా రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌కు సాధ్య‌మైనంత వేగంగా ముగింపు ప‌లికేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక‌, మ‌రో జ‌న‌సేన మంత్రి కందుల దుర్గేష్ శాఖ‌లో పెట్టు బడులు ఆహ్వానిస్తున్నారు. ప‌ర్యాట‌క రంగానికి ఊత‌మిచ్చేలా చేస్తున్న ఈ చ‌ర్య‌లు.. రాష్ట్రానికి మేలు చేస్తున్నాయి.

మొత్తంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అనుస‌రిస్తున్న సైలెంట్ విధానాలు సీఎం చంద్ర‌బాబుకు సంతోషాన్నిస్తున్నా య‌నే చెప్పాలి. అందుకే.. ప‌వ‌న్ శాఖ‌ల‌పై ఇటీవ‌ల నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశంలో చంద్ర‌బాబు ఆయా శాఖ‌ల ప‌నితీరుపై సంతోషం వ్య‌క్తం చేశారు. అంతేకాదు..గ్రామీణ భార‌తం ముఖచిత్రం మారుతున్న తీరు విష‌యంలోనూ.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆయ‌న హ్యాపీగా ఫీల‌వ‌డం గ‌మనార్హం.