ఎస్‌! అందుకే లొంగిపోయాం: మావోయిస్టు ఆశ‌న్న వీడియో

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన కీల‌క నాయకుడు, సిద్ధాంత క‌ర్త‌ల్లో ఒక‌రుగా గుర్తింపు పొందిన మ‌ల్లోజుల వేణుగోపాల రావు, అదేవిధంగా త‌క్కెళ్ల‌ప‌ల్లి వాసుదేవ‌రావు అలియాస్ ఆశ‌న్నలు.. ఇటీవ‌ల ప్ర‌భుత్వాల‌కు లొంగిపోయారు. మ‌ల్లోజుల మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ముందు, ఆశ‌న్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి ముందు.. భారీ బ‌ల‌గాల‌తో వ‌చ్చి.. లొంగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వంద‌లాది తుపాకులు, మందుగుండు సామ‌గ్రిని కూడా పోలీసుల‌కు స్వాధీనం చేశారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. వారికి ప్ర‌భుత్వ ప‌రంగా రావాల్సిన రివార్డుల‌ను కూడా అందించారు.

అయితే.. ఈ విష‌యాన్ని మావోయిస్టు నాయ‌కత్వం(ఇంకా అజ్ఞాతంలో ఉన్న‌) తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. వారు విప్ల‌వ ద్రోహుల‌ని.. విప్ల‌వాన్ని నాశ‌నం చేశార‌ని.. ప్ర‌భుత్వాలు విసిరేసే బిస్క‌ట్ల‌కు లొంగిపోయార‌ని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. వారికి ప్ర‌జాక్షేత్రంలోనే త‌గిన శిక్ష ప‌డుతుంద‌ని కూడా తేల్చి చెప్పింది. దీంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ల్లోజుల‌కు, ఆశన్న‌ల‌కు గ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నాయి. ప్ర‌భుత్వాల‌కు లొంగిపోయి.. వారం రోజులు అయిన‌ప్ప‌టికీ.. ఇంకా పోలీసుల భ‌ద్ర‌త న‌డుమే వీరు ఉన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా శ‌నివారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మీడియాకు ఆశ‌న్న ఓ సంచ‌ల‌న వీడియోను విడుద‌ల చేశారు.

దీనిలో ఆశ‌న్న‌తోపాటు.. కీల‌క నాయ‌కులు, ఇటీవ‌ల పోలీసుల‌కు లొంగిన సుమారు 200మంది ఆయ‌న అనుచ‌రులు కూడా క‌నిపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆశ‌న్న మాట్లాడుతూ.. తాము ఎందుకు లొంగిపోవాల్సి వ‌చ్చిందో వివ‌రించారు. “నిర్బంధం పెరిగిన‌ప్పుడు.. ఉద్య‌మాన్ని కాపాడుకోవాలంటే.. ముందు లొంగిపోవాల‌ని మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ బీఆర్ దాదా నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సార‌థ్యంలోనే క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల నుంచి విప్ల‌వ వీరుల వ‌ర‌కు అంద‌రి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఆ త‌ర్వాతే.. నిర్ణ‌యం తీసుకున్నాం. దీనిలో ఎవ‌రి స్వార్థంలేదు” అని తెలిపారు.

అంతేకాదు.. మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ స‌మ‌ష్టి నిర్ణ‌యం మేరకే తాము లొంగిపోయిన‌ట్టు కూడా ఆశ‌న్న వివ‌రించారు. ప్ర‌భుత్వాలు ఇచ్చే రివార్డుల కోసం తాము ఇప్పుడు లొంగిపోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. విప్ల‌వం పంథా వీడినా.. ఉద్య‌మం మాత్రం కొనసాగుతుంద‌ని.. దీనికి అనేక ప‌ద్ధ‌తులు ఉన్నాయ‌ని తెలిపారు. మారుతున్న కావాల‌ని అనుగుణంగా ఉద్య‌మాన్ని కూడా మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాము ఉద్దేశ‌పూర్వ‌కంగా.. ఏకపక్షంగా ప్ర‌భుత్వాల‌కు లొంగిపోయి తుపాకులు అప్పజెప్పామని వస్తున్న వార్తల్లో నిజం లేద‌న్నారు.

నిజానికి ఒక ద‌శ‌లో దేశంలో ఉద్య‌మాన్నే నిలుపుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యాన్ని కామ్రెడ్స్ గుర్తు పెట్టుకోవాల‌ని తెలిపారు. కొంత మంది స‌మాచార లోపం కార‌ణంగానే.. సెంట్ర‌ల్ క‌మిటీ(సీసీ), జోన‌ల్ క‌మిటీ(జ‌డ్ సీ) స‌భ్యులు త‌మ లొంగు బాటును అపార్థం చేసుకున్నార‌ని ఆశ‌న్న వివ‌రించారు. దీనికి ముందు.. ఆయ‌న మావోయిస్టుల ఉద్య‌మం ప్ర‌స్తుతం ఆగిందే త‌ప్ప‌.. విర‌మించ‌లేద‌న్నారు. దీనిని ఫుల్ స్టాప్‌గా చూడ‌రాద‌ని.. కామాగానే భావించాల‌ని సూచించారు. ‘పెద్ద న‌ష్టం’ జ‌ర‌గ‌కూడ‌ద‌నే లొంగిపోయామ‌న్నారు.

అనేక మంది సాక్షులు కూడా ఉన్నార‌ని ఆశ‌న్న‌ తెలిపారు. పార్టీ ప‌రంగా కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేద్దామ‌న్నారు. పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చ‌ల‌కు తాను సిద్ధ‌మేన‌ని చెప్పారు. న‌ష్టానికి తాను కార‌ణం కాద‌న్నారు. హెచ్చ‌రిక లేఖ‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జ‌లు కూడా త‌మ‌ను ఆహ్వానిస్తున్నార‌ని చెప్పారు. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు సంబంధించి ఏం చేయాల‌న్న దానిపై చ‌ర్చిద్దామ‌న్నారు. మిగిలిన కామ్రెడ్స్‌ను కూడా కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆశ‌న్న పేర్కొన్నారు.

కొన్ని చిత్రాలు..

  • ఆశ‌న్న పూర్తిగా తెలుగులోనే ఈ వీడియోలో మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.
  • ఆశ‌న్న వీడియోలో మాట్లాడుతున్న స‌మ‌యంలో చేతిలో పుస్త‌కం పెట్టుకుని పాయింట్ల‌వారీగా చెప్పుకొచ్చారు.
  • ఆయ‌న వెనుకాల కూర్చున్న మావోయిస్టులు.. తొలిసారి రంగురంగుల దుస్తుల్లో ఉల్లాసంగా క‌నిపించారు.
  • ఏ మాధ్య‌మం ద్వారా ఈ వీడియోను విడుద‌ల చేశార‌న్న‌ది గోప్యంగా ఉంచారు.
  • ఈ వీడియోను ఎక్క‌డ ఎప్పుడు రికార్డు చేశార‌న్న విష‌యాన్నికూడా ర‌హ‌స్యంగా ఉంచారు.