కామెడీ అయిపోతున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ తెరపై ఎంత దూకుడుగా కనిపిస్తారో తెలిసిందే. నిజ జీవితంలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తారాయన. సినిమాల్లో మాదిరే హీరోయిజం చూపించాలని ఎవ్వరూ కోరుకోరు కానీ.. వ్యక్తిత్వ పరంగా ఇలాంటి హీరోల నుంచి కొంచెం తెగువ, దూకుడు, ముక్కుసూటితనం ఆశించడం సహజం. అందులోనూ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమున్నపుడు కచ్చితంగా ఈ లక్షణాలను ఆశిస్తారు. కానీ రజినీ ఎప్పుడూ అభిమానులు కోరుకున్నట్లు ఉన్నది లేదు.

తన రాజకీయ అరంగేట్రాన్ని తేల్చడానికే ఆయనకు 20 ఏళ్లు పట్టింది. అలాగని రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఎప్పుడూ చెప్పలేదు. ఆ రంగంపై ఆసక్తి ఉన్నట్లే కనిపిస్తారు కానీ.. ఎటూ తేల్చరు. జయలలిత, కరుణానిధిల ఆధిపత్యం సాగినంత కాలం రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు ధైర్యం చాల్లేదు. వాళ్లిద్దరి నిష్క్రమణ తర్వాత కొంచెం ధైర్యం చేశారు కానీ.. పార్టీని మొదలుపెట్టి క్షేత్ర స్థాయిలో దిగడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై సంకేతాలు ఇవ్వడం.. అభిమానుల్ని పిలవడం.. వాళ్లతో సమావేశాలు నిర్వహించడం.. చివరికి ఎటూ తేల్చకుండా ఆగిపోవడం.. రెండేళ్లుగా రజినీది ఇదే వరస. అన్నీ సిద్ధం చేసుకున్నాక కరోనా వచ్చి ఆయనకు బ్రేక్ వేసింది. వయసు మీదపడటం, అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో రజినీ అసలు పార్టీని మొదలుపెట్టకుండానే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి.

లాజికల్‌గా ఆలోచిస్తే రజినీ నిర్ణయం మంచిదేలే అనుకున్నారు ఆయన రియల్ ఫ్యాన్స్. కానీ ఇప్పుడు మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. రజినీ మళ్లీ అభిమానులతో సమావేశం అంటున్నారు. పార్టీని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 30న చెన్నైకి రావాలని తమిళనాడులోని అన్ని ప్రాంతాల అభిమాన సంఘాల నాయకులకు సమాచారం అందించారు రజినీ.

ఐతే ఈ వార్త బయటికి రాగానే సోషల్ మీడియా జనాలు కామెడీ మొదలుపెట్టారు. ఇలా రజినీ ఎన్నిసార్లు చేయలేదు.. ఈసారి మీటింగ్‌లో కూడా తేల్చేదేమి ఉండదు.. సరైన సమయంలో నిర్ణయం అంటూ పాత పాటే పాడుతారంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. మరి వాళ్లకు కౌంటర్ ఇచ్చేలా రజినీ ఈసారైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, కార్యాచరణ ప్రకటిస్తారా అన్నది చూడాలి.