రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి ఎందుకు లేదు ?

‘రాజధానిగా అమరావతిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నపుడు ఇదే అసెంబ్లీకి రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు’ ? ఇది తాజాగా హైకోర్టు ధర్మాసనం లాయర్లకు వేసిన సూటి ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు తదితరాలపై జరిగిన విచారణలో పిటీషనర్ల తరపు లాయర్లను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని, సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసే అధికారం లేదని, విభజన చట్టంలో మూడు రాజధానులు అని లేదని పిటీషనర్ల తరపు లాయర్లు వాదించారు.

ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి, అసెంబ్లీకి ఎందుకు లేదని సూటిగా ప్రశ్నించింది. అమరావతిని రాజధాని మార్చింది కూడా ఇదే ప్రభుత్వం, ఇదే అసెంబ్లీ కాదా అని అడిగినపుడు లాయర్లు ఏమీ మాట్లాడలేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన ఇదే అసెంబ్లీకి మరో ప్రాంతాన్ని రాజధానిగా మార్చే అధికారం లేదని ఎలా చెబుతారంటూ నిలదీసింది. పైగా అమరావతే రాజధానిగా ఉండాలని చట్టంలో ఎక్కడుందో చూపించాలని ధర్మాసనం అడిగినపుడు లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు.

రాజధాని విషయంలో తమ పాత్ర లేదని కేంద్రం ఇప్పటికే అఫిడవిట్ లో స్పష్టం చేసినపుడు రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానిదే అన్న విషయం స్పష్టమైపోయింది కదా అని వేసిన మరో ప్రశ్నకు కూడా పిటీషనర్ల లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నదే నిజమైతే అమరావతి రాజధానిగా ఎలా నిర్ణయమైందని అడిగిన ప్రశ్నకు కూడా లాయర్లు మౌనమే సమాధానమైంది.

మొత్తానికి రాజధాని నిర్ణయం విషయంలో కేంద్రం దాఖలు చేసిన మూడు అఫిడవిట్ల తర్వాత, పిటీషనర్ల తరపు లాయర్ల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసానానికి రాజధాని విషయంలో స్పష్టత వచ్చిందనే అనిపిస్తోంది. మొదటి నుండి కూడా మూడు రాజధానుల నిర్ణయం, రాజధాని మార్పు విషయంలో అంతిమ నిర్ణయం తమదే అని మొదటి నుండి రాష్ట్రప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రప్రభుత్వ వాదనతో విభేదిస్తు అనేక పిటీషన్లు దాఖలయ్యాయి.