వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు అనకాపల్లి పోలీసులు.. భారీ షాక్ ఇచ్చారు. ఆయనకు రోడ్డు మార్గం లో పర్మిషన్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. సుమార 63 కిలో మీటర్ల మేర రోడ్ షో చేయాలని జగన్ భావించారని.. కానీ, తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారని.. ఈ నేపథ్యంలో జగన్‌కు రోడ్ షో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఆయన విశాఖపట్నం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్.. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తన హయాంలో తీసుకు వచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 12 కాలేజీలను ప్రవేటు భాగస్వామ్యానికి ఇవ్వడాన్ని ఆయన తప్పుబడు తున్నారు. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. తన నియోజకవర్గంలోనూ.. కొత్తగా మెడికల్ కాలేజీ ప్రారంభించి వదిలేశారని సభలో ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ, దానికి జీవో కూడా లేదని.. అది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమన్నారు. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గంలో నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుందని, కానీ, ఉద్దేశ పూర్వకంగానే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగి సదరు కాలేజీని చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ క్రమంలో గురువారం విశాఖ పర్యటన పెట్టుకున్నారు. విశాఖ నుంచి 63 కిలో మీటర్ల దూరంలో ఉన్న మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ సందర్శించనున్నారు.
దీనికి సంబంధించి వైసీపీ నాయకులు అనకాపల్లి జిల్లా , విశాఖ జిల్లా పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. విశాఖకు వచ్చే జగన్.. అక్కడి నుంచి 63 కిలో మీటర్ల మేర.. రోడ్ షో ద్వారా.. కాలేజీ నిర్మాణంలో ఉన్న మాకవరపాలేనికి వస్తారని పేర్కొన్నారు. రోడ్ షోకు అనుమతించాలని కోరారు. కానీ, తాజాగా అనకాపల్లి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ఘటన నేపథ్యంలో జగన్‌కు ఆ అనుమతి ఇవ్వలేమని.. ఆయన విశాఖ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మాకవరపాలేనికి చేరుకోవచ్చని తెలిపారు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates