విజయ్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర: ఖుష్బూ

త‌మిళ‌నాడులోని క‌రూర్ జిల్లాలో గ‌త నెల 27న రాత్రి చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 41 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణాలేంటి? ఎలా జ‌రిగింద‌నే విష‌యంపై ఎవ‌రి వాద‌న వారు వినిపిస్తున్నా.. ఇత‌మిత్థంగా ఇంకా కార‌ణాలు తెలియలేదు. ఇదిలావుంటే.. నాటి ఘ‌ట‌న‌కు పూర్తిగా డీఎంకే ప్ర‌భుత్వానిదే కార‌ణ‌మ‌ని సీనియ‌ర్ న‌టి ఖుష్బూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ప్ర‌జ‌ల‌ను క‌ట్ట‌డి చేయలేద‌ని ఆమె అన్నారు. దీని వెనుక కుట్ర ఉంద‌న్నారు.

గ‌త నెల 27న రాత్రి త‌మిళ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీ అధినేత ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌.. నిర్వ‌హించిన ర్యాలీలో తొక్కిస‌లాట జ‌రిగింది. వేలుసామి పురంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో 41 మంది మృతి చెందారు. ఇప్ప‌టికీ అనేక మంది ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నార‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ ఘ‌ట‌నకు విజ‌య్ కార‌ణ‌మ‌ని పోలీసులు ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. ఉద్దేశ పూర్వ‌కంగా జ‌న స‌మీక‌ర‌ణ కోసం ఆయ‌న ఆల‌స్యంగా వ‌చ్చార‌ని.. దీంతో జ‌నాభా పెరిగిపోయి.. తొక్కిస‌లాట‌కు దారి తీసింద‌న్నారు.

ఇక‌, విజ‌య్ వాద‌న వేరేగా ఉంది. ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని.. తాము బ‌హిరంగ స‌భ‌కు అనుమ‌తి అడిగితే ఇవ్వ‌నందుకే.. తాము రోడ్ షో చేయాల్సి వ‌చ్చింద‌ని విజ‌య్ వ్యాఖ్యానించారు. ఇలా .. ఇరు ప‌క్షాల మ‌ధ్య వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌లు చోటు చేసుకుంటున్న స‌మ‌యంలో కేంద్రంలోని బీజేపీ నాయ‌కులు రియాక్ట్ అయ్యారు. త‌మ‌ను నిరంత‌రం తిట్టిపోస్తున్న విజ‌య్‌ను వారు వెనుకేసుకు రావ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి విజ‌య్ నాస్తికుడు. కానీ, బీజేపీ మాత్రం ఇప్పుడు ఆయ‌న‌ను వెనుకేసుకువ‌స్తోంది.

తాజాగా బీజేపీ త‌మిళ‌నాడు ఉపాధ్య‌క్షురాలు, సినీ న‌టి ఖుష్బూ భారీ ఎత్తున విజ‌య్‌ను వెనుకేసుకు వ‌చ్చా రు. అస‌లు త‌ప్పంతా ప్ర‌భుత్వానిదేన‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగా విజ‌య్‌పై కుట్ర‌ప‌న్నార‌ని.. అంత ఇరుకు రోడ్డు కేటాయించాల‌ని ప్ర‌భుత్వానికి ఎలా అనిపించింద‌ని ప్ర‌శ్నించారు. ఇది ముమ్మాటికీ అధికార పార్టీ కుట్ర‌గా అబివ‌ర్ణించారు. ఒక రాజ‌కీయ పార్టీ పుంజుకుంటే ఓర్వ‌లేని త‌నం వ‌ల్లే సీఎం స్టాలిన్ అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు. వాస్త‌వానికి టీవీకే అడిగిన మేర‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్టు సీఎం కూడా ప్ర‌క‌టించారు. కానీ, విజ‌య్ కోసం.. బీజేపీ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.