టీడీపీ మాజీ మంత్రి సైలెంట్ వెనుక‌.. ఏం జ‌రిగింది..?

క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ భూమా అఖిల ప్రియ కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు. నిజానికి ఆమె రాజకీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు.. త‌ర్వాత రాజ‌కీయాలు చేసిన‌ప్పుడు కూడా ఎంతో సైలెంట్‌గా ఉండేవారు. త‌న తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డిచారు.

అయితే, నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆమె ఒక్క సారిగా పుంజుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఈమెకు రాజ‌కీయాలు ఏం తెలుసు అనుకున్న‌వారు కూడా ముక్కున వేలేసుకునేలా వ్య‌వ‌హ‌రించి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులు సంపాయించుకున్నారు. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే వ‌చ్చిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాచాటుకున్నారు.

టికెట్ ద‌క్కించుకోవ‌డంలో శిల్పా కుటుంబంతో త‌లెత్తిన వివాదం విష‌యంలోనూ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగారు. త‌న బాబాయి కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడ‌మే కాకుండా ఆయ‌న‌ను ఉప పోరులో గెలిపించుకునేందుకు కూడా కృషి చేశారు.

ఇలా అఖిల ప్రియ త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. ఇక‌, మంత్రిగా కూడా కొన్ని కొన్ని లోపాలు ఉన్న‌ప్ప‌టికీ.. బాబును మెప్పించే రీతిలోనే ముందుకు సాగారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ తుఫాన్‌తో ఆమె గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. అయినా కూడా టీడీపీలోనే ఉంటూ.. వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌డిచిన రెండు నెలలుగా మాత్రం ఆమె పూర్తిగా సైలెంట్‌గా ఉంటున్నారు. దీనికి కార‌ణం తాజాగా వెలుగు చూసింది. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను త‌న సోద‌రుడు జ‌గ‌ద్విఖ్యాత్ రెడ్డికి ఇవ్వాల‌ని పార్టీ అధిష్టానంపై అఖిల ప్రియ ఒత్తిడి చేస్తోంద‌ట‌!

ఇప్ప‌టికే ఇక్క‌డి కార్య‌క్ర‌మాల్లో మాజీ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డిని ప‌క్క‌న పెట్టారు. ఏ కార్య‌క్ర‌మ‌మైనా.. కూడా జ‌గ‌ద్విఖ్యాత్ రెడ్డితోనే చేయిస్తున్నారు. అయితే, అధికారికంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ క్ర‌మంలోనే రెండు నెల‌ల కింద‌ట హైద‌రాబాద్‌లో యువ నాయ‌కులు లోకేష్ ఫ్యామిలీ ఇచ్చిన విందుకు జ‌గ‌ద్విఖ్యాత్‌ను పంపాల‌ని అఖిల ప్రియ నిర్ణ‌యించుకున్నారు.

కానీ, ఆమెకు ఆహ్వానం అంద‌లేద‌ట‌. దీనికితోడు బ్ర‌హ్మానంద‌రెడ్డిని త‌ప్పుకోవాల‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ సొంత సోద‌రుడు జగ‌ద్విఖ్యాత్‌రెడ్డిని నిల‌బెడ‌తామ‌ని అఖిల ప్రియ చెబుతున్నారు. దీనికి బ్ర‌హ్మానంద రెడ్డి వ‌ర్గంతో పాటు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. ఇక నంద్యాల మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత ఇన్‌చార్జ్ బ్ర‌హ్మానంద‌రెడ్డి అటు బ‌న‌గాన‌ప‌ల్లె వైసీపీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డికి స్వ‌యానా అల్లుడు కావ‌డంతో ఆయ‌న కూడా టీడీపీలో ఉండాలా ? వైసీపీకి వెళ్లాలా ? అన్న ఊగిస‌లాట ధోర‌ణిలో ఉన్నార‌ట‌.

అఖిల మాత్రం నంద్యాల సీటు నుంచి బ్ర‌హ్మానంద‌రెడ్డిని త‌ప్పించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని భోగ‌ట్టా..! ఈ ప‌రిణామాల‌తో ఒక‌వైపు కుటుంబ వివాదాలు కూడా న‌డుస్తున్నాయి. భూమా ఫ్యామిలీలోనే కొంద‌రు బీజేపీలోకి వెళ్లిపోయారు. మ‌రోప‌క్క‌, అధిష్టానం కూడా కుటుంబ వివాదాల‌తో వారే ఏదో ఒక‌టి తేల్చుకున్నాక‌.. మ‌నంతీర్పు చెబుదాం. అనే ధోర‌ణిలో ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అఖిల ప్రియ సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు. మ‌రి ఈ వివాదం ఎప్ప‌టికి స‌ర్దుమ‌ణుగుతుందో చూడాలి.