తమిళ స్టార్ హీరో విజయ్ కు శుక్రవారం ఊహించని షాక్ ఎదురైంది. ఆయన స్థాపించిన పార్టీ తమిళ వెట్రిగ కళగం (టీవీకే) మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచి కొట్టివేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై అటు దర్యాప్తు గానీ, ఇటు విచారణ గానీ ప్రాథమిక దశలో ఉండగానే సీబీఐ దర్యాప్తును ఎలా కోరతారని కోర్టు ప్రశ్నించింది. కనీసం ఘటనపై ప్రాథమిక సమాచారం రాకుండానే సీబీఐ విచారణ కోరడం సబబు కాదని పేర్కొంటూ పిటిషన్ కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది.
7 నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్ భారీ సన్నాహాల్లో ఉన్నారు. ఈ నెలల పాటు ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్న ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గత నెల చివర్లో కరూర్ లో జరిగిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగగా… 41 మంది చనిపోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున విజయ్ పరిహారం ప్రకటించారు. త్వరలోనే ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బలంగా రాజకీయాల్లోకి వస్తున్న తనను అభాసుపాలు చేసి ఆదిలోనే రాజకీయాల నుంచి పంపించివేయాలని పథకం పన్నిన అధికార, విపక్షలు ఈ ఘటనకు కారణమని విజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కరూర్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం జరిపే ఏ విచారణలోనూ నిజానిజాలు నిగ్గు తేలవని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రెండు రోజుల్లోనే హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని తొందరపాటు చర్యగా పరిగణిస్తూ హైకోర్టు కొట్టివేయడం టీవీకే వర్గాలతో పాటు విజయ్ ను షాక్ కు గురి చేసిందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates