ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 35 వేల దాకా ఉంటే.. అందులో దాదాపు మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అక్కడ కరోనా కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 600 మంది దాకా మృతి చెందారు. దేశంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం అయిన ధారావి మురికివాడలో వందల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. పదుల సంఖ్యలో చనిపోతున్నారు.
అలాంటి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. లాక్ డౌన్ అమలవుతున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా మందుబాబుల కష్టం మామూలుగా లేదు. ప్రతి రాష్ట్రం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మీద ఎంతగానో ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాల్ని నడపడమే కష్టంగా ఉంది. అయినప్పటికీ కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలకు సాహసించడం లేదు.
ఐతే దేశంలోనే కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్నా.. మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యేలా ఉన్నా మహారాష్ట్ర మాత్రం మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారవడంతో మద్యం అమ్మకాలు పునఃప్రారంభించాల్సిందే అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. కొన్ని రోజుల కిందట ఆయన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వకుంటే చాలా కష్టమవుతుందని హెచ్చరిస్తూ అన్నకు లేఖ రాశాడు.
అధికారుల నుంచి కూడా ఇదే రకమైన సూచనలు రావడంతో ఉద్ధవ్ సానుకూల నిర్ణయం తీసుకున్నాడు. ఐతే నెలన్నర రోజుల పాటు మద్యానికి ముఖం వాచిపోయిన మందుబాబులు వైన్ షాపుల మీదికి ఒక్కసారిగా దండెత్తితే, పార్టీల పేరుతో గుమిగూడి హంగామా చేస్తే.. ఇళ్లలో మందు కొట్టి కుటుంబ సభ్యుల్ని హింసలకు గురి చేస్తే పరిస్థితేంటి అన్నది చూడాలి.