విజయ్ కు రాహుల్ ఫోన్… టీవీకే పరిస్థితేంటో?

తమిళనాట సినిమాల్లో దళపతిగా పేరు తెచ్చుకుని ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు చక్రబందంలో చిక్కుకున్నారనే చెప్పాలి. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన విజయ్.. మరో 7 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో 41 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాట రాజకీయ ప్రకంపనలను రేపింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం విజయ్ కు ఫోన్ చేసి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.

ఈ ఫోన్ కాల్… అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి బృందాలు తమిళనాడు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలోనే చోటుచేసుకుంది. ఇప్పటిదాకా విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కరూర్ ఘటనతో విజయ్ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ కు ఇప్పుడు ఇండియా కూటమి గానీ లేదంటే ఎన్డీఏ కూటమి మద్దతు గానీ తప్పనిసరిగా అవసరం అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరి విజయ్ ఎవరి వైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులో ఇండియా కూటమిలోని కీలక భాగస్వామి డీఎంకే అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. రాహుల్ ఫోన్ చేశారన్న భావనతో డీఎంకే సర్కారు విజయ్ ను, ఆయన పార్టీని రక్షించవచ్చు గానీ… దాని పరిణామాలు చాలా ఘాటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు విజయ్ మద్దతు పలికితే… కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నేరుగా రంగంంలోకి దిగి కరూర్ ఘటనపై దర్యాప్తు అంటూ సతాయించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎన్నికల 

సంఘానికి ఫిర్యాదు చేసి ఏకంగా పార్టీని రద్దు చేయించే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఎన్డీఏకు విజయ్ మద్దతు తెలిపితే తమిళనాడులోని డీఎంకే సర్కారు ఆయనను క్షణాల్లో అరెస్టు చేసి సరిగ్గా ఎన్నికల ముందు ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితిని విజయ్ ఎలా దాటగలుగుతారో చూడాలి.