మోడీ కోసం బాబు… రంగంలోకి దిగిపోయారు!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్న సీఎం చంద్ర‌బాబు.. అక్క‌డితోనే త‌న ప‌ని అయిపోయింద‌ని భావించ డం లేదు. ఏదేశ‌మేగినా.. ఎందు కాలిడినా.. అన్న‌ట్టుగా ఎక్క‌డ ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మోడీ ఈజ్ గ్రేట్ లీడ‌ర్ అంటూ ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. బ‌హిరంగ స‌భ‌ల్లోనే కాదు.. చివ‌ర‌కు అసెంబ్లీలోనూ ఇటీవ‌ల 20 నిమిషాల పాటు త‌న ప్ర‌సంగంలో మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. ఈ దేశ ముద్దుబిడ్డ‌గా అభివ‌ర్ణించారు. యోగా కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌డంతోపాటు.. ఇత‌ర‌కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న చేతుల మీదుగా ప్రారంభించేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యారు.

ఇలా ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు మోడీని ప్ర‌శంసిస్తున్న చంద్ర‌బాబు.. తాజాగా కేంద్రం అమ‌లు చేస్తున్న వ‌స్తు, సేవ‌ల ప‌న్ను… జీఎస్టీ-2.0పై తాను ముందుగా క‌దిలారు. ప్ర‌జ‌ల‌కు ఈ జీఎస్టీ-2.0 ఫ‌లాలను వివ‌రించ‌డంతోపాటు.. కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న మేలును వివ‌రించే కార్య‌క్ర‌మానికి మంగ‌ళ‌వారం శ్రీకారం చుట్టారు. వాస్త‌వానికి జీఎస్టీ-2.0పై.. ఏపీ అసెంబ్లీలోనే అనుకూలంగా తీర్మానం చేశారు. దీనిని కేంద్రానికి పంపించారు. ఇలా.. జీఎస్టీ-2.0కి అనుకూలంగా తీర్మానం చేసిన ఏకైక తొలి రాష్ట్రంగా కూడా ఏపీని నిల‌బెట్టారు. అంతేకాదు.. స‌భ‌లో ప్ర‌సంగించిన చంద్ర‌బాబు.. జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌తో దేశం ముందుకు సాగుతుంద‌ని, విక‌సిత్ భార‌త్ సాకారం సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శంస‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే నెల 15వ తేదీ నుంచి క్షేత్ర‌స్థాయిలో జీఎస్టీ-2.0పై పెద్ద ఎత్తున ప్ర‌చార కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హిస్తున్న‌ట్టుగా అసెంబ్లీలోనే సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స‌హా కూట‌మి పార్టీల‌ను కూడా ఆహ్వానిస్తున్నామ‌ని చెప్పారు. గ్రామాలు, మండ‌లాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు స‌హా అన్ని ప్రాంతాల్లోనిఇంటింటికీ వెళ్లి జీఎస్టీ-2.0 ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించ‌నున్నారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌పై ఈ సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా.. 8 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కుల బ్ధి పొందే అవ‌కాశం ఉంద‌ని కూడా చంద్ర‌బాబు తెలిపారు. ఈ విష‌యాల‌ను మ‌రింత స‌మ‌గ్రంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

తాజాగా ప్రారంభం..

ప్ర‌జ‌ల వ‌ద్దకు వెళ్లి.. జీఎస్టీ-2.0 సంస్క‌ర‌ణ‌లు వివ‌రించే కార్య‌క్ర‌మాన్ని వ‌చ్చే నెల 15న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన చంద్ర‌బాబు.. ఈలోగానే.. ఆన్‌లైన్, ఫోన్ మార్గాల్లో దీనిపై ప్ర‌చారం ప్రారంభించారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఫోన్లు చేసి.. జీఎస్టీ-2.0 ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రిస్తున్నారు. కేంద్రం తీసుకువ‌చ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు ప్ర‌జ‌ల ఆర్థిక క‌ష్టాలు త‌గ్గించ‌డంతోపాటు.. వారిని పొదుపు మార్గం వైపు మ‌ళ్లిస్తాయ‌ని ఈ ఫోన్‌ల‌లో చెబుతున్నారు. అలానే.. ప్రాంతాల వారీగా త‌గ్గిన ధ‌ర‌ల‌ను కూడా ఫోన్ల‌లోనే చెబుతున్నారు. నిత్యావ‌స‌రాలు స‌హా.. ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, కుక్క‌ర్లు, ఏసీలు ధ‌ర‌లు త‌గ్గాయ‌ని.. ఇదంతా ప్ర‌ధాని మోడీ దూర‌దృష్టికి నిద‌ర్శ‌మ‌ని ఫోన్ల‌లో చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి మోడీ త‌ర‌ఫున చంద్ర‌బాబు బాగానే క‌ష్ట‌ప‌డుతున్నార‌న్న కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.