తమిళనాడులోని కరూర్‌లో శనివారం రాత్రి జరిగిన ఘోర తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఇంకా, పదుల సంఖ్యలో బాధితులు ఆదివారం ఉదయం వరకు కూడా కోలుకోలేని స్థితిలోనే ఉన్నారని.. అధికారిక వర్గాలు తెలిపారు. మరింత మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతమిత్థంగా చెప్పాలంటే.. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ ఘటనపై విచారణకు అప్పటికప్పుడు సీఎం స్టాలిన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణతో విచారణకు కమిటీ నియమించారు. మహిళా న్యాయమూర్తి ఆదివారం తెల్లవారు జామునే కరూర్‌లో ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
లక్షలాది చెప్పులు రోడ్లపై అలానే పడి ఉన్నాయి. వేలాది వాటర్ బాటిళ్లు, లక్షల సంఖ్యలో వాటర్ ప్యాకెట్లు కూడా ఘటన విషాదాన్ని కళ్లకు కట్టాయి. అయితే.. అసలు ఇంత విషాదం జరగడానికి కారణమేంటి? ఎందుకు? అసలు ఏం జరిగింది? అనేది కీలక అంశం. 2024, ఫిబ్రవరి 2న పురుడు పోసుకున్న తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీకి యువ హీరో.. ఇళయ దళపతిగా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నాయకులను రెడీ చేస్తున్నారు. మరో ఏడు మాసాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఏం జరిగింది?
ఉదయం 10: కరూర్‌లోని వేలుసామిపురంలో బహిరంగ సభకు టీవీకే భారీ ఏర్పాట్లు చేసింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు.
ఉదయం 11: వాస్తవానికి ఉదయం 11గంటలకే కరూర్‌లో సభ జరుగుతుందని ప్రచారం చేశారు. కానీ,ఇది వాయిదా పడింది. సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. దీంతో ప్రజలు చాలా సేపు వేచి చూశారు.
సాయంత్రం 3: మరింత మంది అభిమానులు పెరిగిపోయారు. దీనికి తోడు.. స్థానికంగా.. ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
సాయంత్రం 4: టీవీకే అంచనా ప్రకారం 50 వేల మంది మాత్రమే వస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా 5 లక్షల మందికి పైగా సాయంత్రం 4 గంటలకే చేరుకున్నారు.
సాయంత్రం 6: ఎటు చూసినా.. జనం. రోడ్లు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీనిని ముందుగానే టీవీకే పార్టీ నాయకులు అంచనా వేయాల్సి ఉంది. కానీ, వేయలేక పోయారు.
సాయంత్రం 7: టీవీకే అధిపతి విజయ్.. రావడం ప్రారంభమైంది. ఆయన కాన్వాయ్ వస్తున్న సమాచారాన్ని ప్రచారం చేశారు. దీంతో అప్పటి వరకు ఒకింత అసహనంతో ఉన్న ప్రజలు ఆయనను చూసేందుకు మరింత ముందుకు దూసుకువచ్చారు. దీంతో సభా వేదిక వద్దకు కూడా.. విజయ్ చేరుకోలేకపోయారు. దీంతో బస్సు పైనే ఉండి ప్రసంగం ప్రారంభించారు.
సాయంత్రం 7:20: రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. “ఈ సారి మనదే రాజ్యం. తమిళనాడు కష్టాలు ఎలా ఉన్నాయో.. నేను చెప్పను.. మీ మీ సెల్ ఫోన్లలోని యూట్యూబ్‌లో చూసుకోండి. కరూర్‌కు అన్యాయం జరుగుతోంది. అన్యాయం చేశారు.” అంటూ.. ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
సాయంత్రం 7:30: “మీ హీరోని మీరు సీఎంగా చూడాలని అనుకుంటున్నారా? లేదా?. మీ విజయ్.. మీ చిన్నోడు.. ముఖ్యమంత్రి కావాలా.. వద్దా..?” అని సెంటిమెంటును పూసి మరింత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కపెట్టున ప్రజలు మరింత ముందుకు కదిలారు.
సాయంత్రం 7:40: ముందుకు తరలి వస్తున్న జనాలతో ఆ ప్రాంతం ముక్కుమూసినట్టు అయిపోయింది. అసలే మనిషిపై మనిషి ఉన్నట్టుగా ఉన్న ఆ ప్రాంతం పూర్తిగా అదుపు తప్పింది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే స్వల్ప తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ నేలపై పడిపోయారని విజయ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయనే స్వయంగా సదరు మహిళను కాపాడాలని, తోపులాటలు వద్దని సూచించారు. పోలీసులు రంగంలోకి దిగి సాయం చేయాలని కోరారు. కానీ, అప్పటికే.. అదుపు తప్పిన ప్రజలు.. విజయ్ ను చూసేందుకు ఎగబడ్డారు. కన్నుమూసి తెరిచేలోపే.. ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మరింత మంది ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు.
రాత్రి 9:30: కరూర్ తోపులాట వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పందించిన సీఎం స్టాలిన్.. రంగంలోకి దిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates