బీజేపీ సీనియర్ నేత, కృష్ణాజిల్లా కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు.. యూటర్న్ తీసుకున్నారు. గురువారం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ జో్క్యం చేసుకుని.. మరింత కాకపుట్టించారు. ఈ వివాదంపై అటు సినీ రంగంలోని ప్రముఖులు.. ఇటు రాజకీయ రంగంలోని ప్రముఖు లు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కామినేని వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై పెద్ద ప్రకటనే ఆయన విడుదల చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం కామినేని సభలో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.
ఏం జరిగింది?
గురువారం నాటి సభలో కామినేని శ్రీనివాసరావు లఘు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన గతంలో సీఎం జగన్ ను సినీ హీరోలు, దర్శకులు కలిసి.. టికెట్ ధరలు పెంచుకునే అంశంపై చర్చించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటి సీఎం జగన్.. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దహీరోలు, దర్శకులు వచ్చినా కలుసుకునేందుకు ఇష్టపడలేదన్నారు. ఏదైనా ఉంటే.. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితోనే భేటీ కావాలని సూచించారని, దీంతో చిరంజీవి జోక్యం చేసుకుని సీఎం జగన్‌ను మాత్రమే తాము కలుస్తామని పట్టుబట్టడంతో విధిలేని పరిస్థితిలో పేర్ని నాని.. అప్పటి సీఎం జగన్‌ను కలుసుకునేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇది సినీ రంగాన్ని అవమానించడమే కదా!. అని అన్నారు.
ఈ సమయంలో సభలోనే ఉన్న బాలయ్య.. జోక్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఆ సైకోగాడ్ని కలుసుకునేందుకు వాడెవ డో.. వీడెవడో ఒత్తిడి చేయలేదు.” అని వ్యాఖ్యానించారు. అలా అలా జరిగిపోయిందన్నారు. ఇక, తనను పిలవలేదన్న వ్యాఖ్యలు చేశారు. తనను పిలిచేందుకు ప్రయత్నించారన్న విషయం తనకు తర్వాతే తెలిసిందన్నారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ.. తాము అడిగిన వెంటనే సీఎం జగన్ అంగీకరించారని.. ముందు ఐదుగురిని రమ్మన్నారని.. కానీ, తాము పది మంది వస్తామంటే కూడా.. అనుమతించామని చెప్పారు. సీఎంతో కలిసి లంచ్ కూడా చేశామని వివరించారు. బాలయ్య పిలిచేందుకు పలు విధాల ప్రయత్నం చేశామని, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
అయితే.. ఈ విషయం వివాదం కావడంతోపాటు.. రాజకీయంగా కూడా.. టీడీపీ-జనసేనల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యం లో కామినేని శ్రీనివాసరావు.. తన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఈమేరకు శనివారం ఆయన స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడికి విన్నవించారు. అయితే.. దీనిపై స్పీకర్ మౌనం వహించారు. ఎందుకంటే.. కామినేని చేసిన వ్యాఖ్యల అనంతరం.. బాలయ్య కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కూడా తొలగించాల్సి ఉంటుంది.(అనుబంధం అంశం కావడంతో) కానీ, బాలయ్య దీనిపై మౌనంగా ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో ఈ వ్యాఖ్యలను తొలగించే అవకాశం లేదు. అయితే.. కామినేని మాత్రం పదే పదే తన వ్యాఖ్యలను రికార్టుల నుంచి తొలగించాలని కోరడం ద్వారా కొంత వరకు.. వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates