వెనుకా ముందు చూసుకోకుండా ఎంత మాట పడితే అంత మాటను అనేసే ఓవైసీ ఫ్యామిలీ.. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల వేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వేళలో తన నోటికి పని చెప్పారు మజ్లిస్ అధినేత అసద్ సోదరుడు అక్బరుద్దీన్. గడిచిన రెండు రోజులుగా పాతబస్తీపైనా.. మజ్లిస్ పార్టీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కమలనాథులకు ఏ మాత్రం తగ్గని రీతిలో తాజాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
టీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీలు ఎంత మాత్రం మిత్రులు కాదన్న విషయాన్ని ఎంత చెప్పినా ప్రజలు నమ్మటం లేదన్న కోపమో.. బాగా నమ్మించాలంటూ మసాలా మరింతగా దట్టించటం తప్పించి మరో అవకాశం లేదనుకున్నారో కానీ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో 4700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్.. ఈరోజున 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెబుతున్న కేసీఆర్ సర్కారు.. హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ.. ఎన్టీఆర్ సమాధుల్ని కూడా కూల్చాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో డబుల్ బెడ్రూం రూం ఇళ్లను ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకు ఇవ్వలేదన్న ఆయన.. మళ్లీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మాయ మాటలు చెబుతోందన్నారు. ఇన్ని మాటలు చెబుతున్న అక్బరుద్దీన్.. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కాస్త ముందుగా తన సోదరుడు కమ్ పార్టీ అధినేత అసద్.. స్వయంగా ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంసాబ్ ను కలిసి ముచ్చట్లు చెప్పి రావటం తెలిసిందే. మరి.. ఆ సందర్భంగా ఆయన ఈ ప్రశ్నల్ని సంధించలేదా? అన్నది ప్రశ్న.
టీఆర్ఎస్ – మజ్లిస్ మధ్య ఏ మాత్రం సంబంధాలు లేవన్న భావన కలిగించటమే ప్రస్తుత లక్ష్యమన్నట్లుగా అక్బరుద్దీన్ మాటలు ఉండటం గమనార్హం. అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక ఎలా తొక్కాలో తమకు తెలుసన్న అక్బర్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. సన్నిహితులు సైతం సందేహించేలా మాట్లాడటం చూస్తే.. పోలింగ్ నాటికి ఈ మాటల తూటాలు ఏ స్థాయి వరకు వెళతాయో?