రాజకీయాల్లో పట్టుదలలకు, పంతాలకు చోటు ఉండదు. ఎందుకంటే ప్రజా కోణంలో చూసినప్పుడు నాయకులు కొన్ని కొన్ని సందర్భాల్లో అవమానాలను ఎదురుకోవాలి. అదే సమయంలో విమర్శలు కూడా తట్టుకోవాలి. ఈ రెండిటికీ సిద్ధంగా లేనప్పుడు రాజకీయాల్లో ఉండడమే వేస్ట్. ఈ మాట వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ మారం చేయటం. అదే విధంగా తనకు సీఎంతో సమానంగా మైకు ఇవ్వాలని పట్టుబట్టడం. ఈ విషయాలు ప్రజల్లోనూ అదేవిధంగా నాయకుల్లో కూడా చులకనగా మారాయి.
నిజానికి మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ఉండే విలువ, జగన్‌కు ఉండే ప్రాధాన్యం ఎప్పటికీ ఉంటుంది. అది సభలో అయినా బయట అయినా ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. కానీ, పట్టుబట్టి తనకు గంటల కొద్దీ సమయం కావాలని కోరడం, ముఖ్యమంత్రితో సమానంగా సమయం ఇవ్వాలని అడగడం అంటివి ఇబ్బందికరంగా మారాయి. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టడం మెజారిటీ లేకపోయినా అడుగుతున్నారన్న వాదనను తోసి పుచ్చలేని పరిస్థితిలో జగన్ ఉండటం వంటివి రాజకీయంగా ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వైసిపి నాయకులు కూడా జగన్ పట్టుదలపై అంతర్గతంగా చర్చ చేస్తున్నారు. ఈ తరహా పరిస్థితి మంచిది కాదని పట్టు విడుపులు ఉండాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే మొత్తానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కూడా అంటున్నారు. నిజానికి చెప్పాలంటే జగన్ సభకు రావడం వల్లే మేలు జరుగుతుందని వైసిపి నాయకులు కూడా అంటున్న మాట. ఎందుకంటే ఒకవేళ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే.. వేచి చూసి బయటకు వచ్చి మీడియ ముందే ఈ విషయాలు చెప్పి ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది.
రెండోది సభలో ఒకవేళ తనను అవమానించే పరిస్థితి ఏర్పడితే ఆ అవమానాలను కూడా తాను తట్టుకున్నానని ప్రచారం చేసుకునేందుకు కూడా ఆయనకు గొప్ప అవకాశం కలుగుతుంది. గతంలో చంద్రబాబు కూడా ఈ పనే చేశారు. సభలో తనను అవమానించారంటూ బయటికి వచ్చి కన్నీరు పెట్టుకుని ప్రజల ముందు మాట్లాడారు. ఇదే ఆయనకు మెరుగైన సానుభూతిని సొంతం చేసింది.
ఇక మూడో అంశం సభలో తనను ఎవరైనా గేలి చేసిన లేదా తన ప్రభుత్వ విధానాలను తప్పు పట్టినా ఎదురుదాడి చేసేందుకు, విమర్శించే అవకాశం ఉంటుంది. తనను తప్పుపట్టే వారిని సభలో నిలదీసే అవకాశం ఉంటుంది. మైకు ఇవ్వకపోయినా జగన్ మాట్లాడేందుకు ఛాన్స్ ఉంటుంది. వీటిని సొంత మీడియా ద్వారా హైలెట్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇదీ వైసిపి నాయకులు చెబుతున్న మాట. మొత్తంగా ఈ మూడు అంశాలను పరిశీలిస్తే జగన్ సభకు వెళ్లడమే బెటర్ అన్నది వైసీపీలో సీనియర్ నాయకులు మధ్య జరుగుతున్న చర్చ.
Gulte Telugu Telugu Political and Movie News Updates