ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యేల ప్రశ్నలు, వారి సూచనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “చెప్పడం తేలిక.. చేస్తే తెలుస్తుంది.. అధ్యక్షా!” అని వ్యాఖ్యానించారు. సుమారు 4 నిమిషాల తన సమాధానంలో ఆయన ఆచి తూచి వ్యవహరించారు. తీవ్ర కోపాన్ని కూడా ఆయన తగ్గించుకున్నట్టు పలు సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. “సభ్యులు అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. అవి ఇప్పుడే వచ్చాయా?” అని ఓ సందర్భంలో ప్రశ్నించిన ఆయన.. సమస్యలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే.. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని అనుకుంటే పొరపాటేనని చెప్పారు.
విషయం ఏంటి?
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్న పవన్ కల్యాణ్‌ను టీడీపీ సభ్యులు పలువురుకొన్ని ప్రశ్నలు అడిగారు. ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రాన్ని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు ఏంటి? సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలను ఎప్పటికి చేరతారు? ప్లాస్టిక్ పరిశ్రమలను మూసివేయడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? అని వారు ప్రశ్నలు సంధించారు. వీటిపై స్పందించిన పవన్ కల్యాణ్.. “అన్ని సభ్యులకు తెలుసు. తెలిసి కూడా అడిగితే ఎలా?” అని ప్రారంభిస్తూ.. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల పరిస్థితులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కానీ, రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని అనుకోవద్దన్నారు. ప్లాస్టిక్ భూతం అనే సమస్యను దేశం ఎదుర్కొంటున్న సమస్యగా ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు.. ప్లాస్టిక్ పరిశ్రమలను ఇప్పటికిప్పుడు మూసి వేయడం ద్వారా.. అనేక వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని పవన్ వ్యాఖ్యానించారు. అప్పుడు వారికి ఉపాధి చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలకు ఈ సమస్య తెలియదని తాను అనుకోవడం లేదన్నారు. అయినా.. ప్రశ్నించారు కాబట్టి చెబుతున్నానని అన్నారు. ఒక ఫ్లెక్సీ, బ్యానర్ల కారణంగానే.. అనేక రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పారు. వాటిని నిషేధించాలని తమకు కూడా ఉందన్నారు. అయితే.. వాటిని నిషేధిస్తే.. ఆయా కంపెనీలు పెట్టుకున్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అన్నీ నిదానంగా జరుగుతాయని.. ముందుగా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అయితే.. ఇవన్నీ.. ఒక టైం బౌండ్ ప్రకారం జరుగుతాయని తెలిపారు. ఎమ్మెల్యేలు కొంత సంయమనం పాటించడంతో పాటు తమకు కూడా సమయం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో పర్యావరణాన్ని పెంచేందుకు కోటి మొక్కలు పెంచాలని నిర్దేశించుకున్నామని.. ఇది తన ఒక్కడి వల్ల అయ్యే పనికాదని చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో కూడా.. పర్యావరణం పెంపుపై దృష్టి పెట్టినప్పుడే సాకారం అవుతుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates