కమలంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చేశారు. తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి జనసేన నుండి బీజేపీ నుండా అనే విషయాన్ని తొందరలోనే ప్రకటిస్తామంటూ చెప్పారు. నిన్నటి వరకు తిరుపతి ఉపఎన్నికలో బీజేపీనే పోటి చేస్తుందని పది సార్లయినా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నెల రోజుల క్రితమే ఉపఎన్నికలో బీజేపీ నే పోటీ చేస్తుందని వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించేసిన విషయం అందరు చూసే ఉంటారు. అప్పటి నుండి మిత్రపక్షం జనసేనతో సమస్యలు మొదలయ్యాయి.
తమతో మాట మాత్రమైనా మాట్లాడకుండానే వీర్రాజు ఏకపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని ప్రకటించేయటం ఏమిటంటూ పవన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన అసంతృప్తిని బయటపెట్టడానికి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలను వేదికగా మార్చుకున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కూడా ఏకపక్షంగానే ప్రకటించేశారు. దాంతో బీజేపీకి ఇబ్బందిగా మారింది. అందుకనే జనసేనను పోటి నుండి విత్ డ్రా అయ్యేట్లుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్వయంగా పవన్ ను కలిసి మాట్లాడారు.
రెండు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో చివరకు పవన్ మెత్తపడ్డారు. అయితే జీహెచ్ఎంసి ఎన్నికల్లో విత్ డ్రా చేసుకున్నాం కాబట్టి తిరుపతి లోక్ సభలో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో ఢిల్లీ నుండి కబురు రావటంతో హడావుడిగా వెళ్ళిపోయారు. బహుశా బీజేపీ జాతీయ నేతలతో తిరుపతి విషయాన్ని చర్చించినట్లున్నారు. మరి అక్కడి నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయో ఏమో వీర్రాజుకు.
అందుకనే తాజాగా వీర్రాజు మాట్లాడుతూ పోటీలో ఏ పార్టీ అభ్యర్ధి ఉంటారో ప్రకటన చేస్తామంటూ మాట మార్చేశారు. నిజానికి రెండు పార్టీలకు కూడా ఎన్నికను గెలుచుకునేంత సీన్ లేదని అందరికీ తెలుసు. తామే పోటీ చేయాలనే విషయంలో రెండు పార్టీలు చెప్పుకుంటున్న కారణాలు కూడా లాజిక్ కు అందటం లేదు. తిరుపతి స్ధానంలో తమకే ఎక్కువ ఓట్లున్నాయంటే తమకే ఉన్నాయంటు ఊదరగొడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు మహా అయితే 50 వేలు కూడా ఉండవు.
ఏదో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే కాస్త హడావుడి చేద్దామని తప్ప మరో ఆలోచన ఏమీ ఉన్నట్లు లేదు. మొత్తానికి ఢిల్లీలో క్యాంపు వేసిన పవన్ ప్రభావం వీర్రాజు మీద పడినట్లే కనిపిస్తోంది. లేకపోతే అభ్యర్ధిని ప్రకటించేయటమే తరువాయిని మాట్లాడిన వీర్రాజు యూటర్న్ తీసుకున్నారంటే అర్ధమేంటి ? కాబట్టి వీర్రాజు చెప్పినట్లుగానే అభ్యర్ధి ఏ పార్టీ వాళ్ళో తేలిపోవాలంటే మరి కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందేనేమో . చూద్దాం ఏమి జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates