మోడీని జ‌గ‌న్ ఓవ‌ర్ టేక్ చేస్తారా? సోష‌ల్ మీడియా చ‌ర్చ‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఏపీ సీఎం జ‌గ‌న్ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. మోడీ త‌న వాక్చాతుర్యంతో దూసుకు పోతుంటే.. జ‌గ‌న్ మాత్రం మౌనంగా ప‌రుగులు పెడుతున్నారు. ప్ర‌జ‌ల అభిమానాన్ని.. పాల‌న‌లో మెరుపుల‌ను మోడీ ఆస్వాదిస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా అంతే రేంజ్‌లో ప్ర‌జాభిమానాన‌ని ఆస్వాదిస్తున్నారు. దీంతో ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య భారీ పోటీ ఏర్ప‌డింది. ఈ పోటీలో మోడీ ఒకింత ముందున్నా.. జ‌గ‌న్ ఆయ‌న‌ను ఓవ‌ర్ టేక్ చేసే రేంజ్‌కు చేరుకోవ‌డం ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వానికి దేశ ప్ర‌ధానికి.. ఒక రాష్ట్ర సీఎంకు పోలికా? అందునా.. వ‌య‌సులో జ‌గ‌న్ క‌న్నా పాతికేళ్ల పెద్ద అయిన‌.. మోడీతో లెక్క‌లా? నాలుగుసార్లు ముఖ్య‌మంత్రిగా, రెండోసారి ప్ర‌ధానిగా చ‌క్రం తిప్పుతున్న మోడీతో తొలిసారి సారి ముఖ్యమంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌కు సాప‌త్య‌మా? అంటే.. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టండి.. సోష‌ల్ మీడియాలో ఇలానే ఉంది అంటోంది.. చెక్‌బ్రాండ్ అనే ఆన్‌లైన్ ఎనాలిసిస్ సంస్థ‌.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌ధాని మోడీ.. నిత్యం సోష‌ల్ మీడియాకు అనుబంధంగా ప‌నిచేస్తారు. ఆయ‌న ఏం చేయాల‌న్నా.. ప్ర‌చారానికి ప్రాధాన్యం ఇస్తారు. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, గూగుల్ సెర్చ్‌..ఇలా.. అన్ని మాధ్య‌మాల‌ను ఆయ‌న వినియోగించుకోవ‌డం తెలిసిందే. ట్విట్ట‌ర్‌లో అయితే మోడీ సంచ‌ల‌నాలు సృష్టించారు. వ్యూస్ నుంచి లైకుల వ‌ర‌కు ఆయ‌న అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు. 2015లో ట్విట్ట‌ర్ అకౌంట‌ర్ ప్రారంభించిన ప్ర‌ధాని నిరంతరం.. దానిని అప్ డేట్ చేస్తున్నారు.

దీంతో సోష‌ల్ మీడియా డ‌యాస్‌ల‌లో ప్ర‌ధాని ‌మోడీ.. దేశంలో టాప్ పొజిష‌న్‌లో ఉన్నారు. మొత్తం 95 మంది రాజ‌కీయ నేత‌లు, 500 మంది వివిధ రంగాల‌కు చెందిన కీల‌క వ్య‌క్తుల‌పై చెక్ బ్రాండ్‌ అధ్య‌య‌నం చేసింది. దీనిలో మోడీకి ట్రెండింగ్‌లో 2171 పాయింట్లు వ‌చ్చాయి. అయితే.. మోడీ త‌ర్వాత ఈ జాబితాలో సీఎం జ‌గ‌న్ ఉన్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కుడిగా జ‌గ‌న్ నిలిచారు. ఆయ‌న‌కు 2137 ట్రెండ్స్ ప‌డ్డాయి. మొత్తంగా చూస్తే.. మోడీ త‌న మెరుపుల్లాంటి మాట‌ల‌తో సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

అయితే.. జ‌గ‌న్ కూడా ఇదే రేంజ్‌లో దూసుకుపోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని పేర్కొంది చెక్ బ్యాండ్‌. ఏదేమైనా.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జాభిమానం సొంతం చేసుకున్న ముఖ్య‌మంత్రుల్లో నాలుగోస్థానంలోను, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సీఎంల స్థానంలో ఫస్ట్ రావ‌డం జ‌గ‌న్ పార్టీలో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.