ఏపీలో అధికార, విపక్షాల మధ్య నలుగుతున్న మెడికల్ కాలేజీల వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. రెండు వైపుల నుంచి ఘాటు వ్యాఖ్యలు దూసుకువస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి తీరుపై మండిపడ్డారు. హోం మంత్రి అనిత మెడికల్ కాలేజీలపై చేసిన ప్రజెంటేషన్ ఆధారంగా రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు హోం మంత్రా? లేదంటే యాంకర్ వా? ఆంటూ అనితపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చి పిచ్చి వీడియోలను తీసుకుని వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
అసలు జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవాలంటే కూటమి నేతలు తన వెంట రావాలని…అలా తన వెంట వచ్చే దమ్ము ఆ మూడు పార్టీల నేతలకు ఉండా? అని కూడా రోజా ప్రశ్నించారు. పులివెందుల, మచిలీపట్నం, నంద్యాల, పాడేరులకు వెళ్లి చూస్తే… తాము కట్టిన మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, మెడికల్ కాలేజీ విద్యార్థులు ఎలా ఉంటారో కూటమి నేతలకు అర్థం అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఎక్కడైనా మంజూరైన పనులు విడతలవారీగా జరుగుతాయి తప్పించి అన్నింటినీ ఒకేసారి చేపట్టి పూర్తి చేయడం అసాధ్యమని ఆమె చెప్పుకొచ్చారు.
పీపీపీని పవన్ అడ్డుకోవాలి..
ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..తన కళ్లెదుటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని రోజా ప్రశ్నించారు. పేదలకు తీవ్ర నష్టం చేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పవన్ అడ్డుకుని తీరాలని ఆమె డిమాండ్ చేశారు. ఏదో స్సెషల్ ఫ్లైట్లు, హెలికాఫ్టర్లలో తిరగడానికి ప్రజలు పవన్ కు ఓటు వేయలేదని ఆమె అన్నారు. కేబినెట్ లో కీలక స్థానంలో ఉన్న పవన్… తన కళ్లెదుటే చంద్రబాబు లెక్కలేనన్ని ప్రజా వ్యవతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా కిమ్మనడం లేదని కూడా రోజా ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ ప్రజల పక్షాన నోరు విప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates