వైసీపీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్.. సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు.. బాధపడుతున్నామని, ప్రజలు తమను ఎందుకు ఓడించారో కూడా అర్ధం కావడం లేదని.. రెండు రోజుల కిందట పార్టీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత.. తమ పార్టీ నాయకులు కూడా యాక్టివ్‌గా పనిచేయలేక పోతున్నారని అన్నారు. అంటే.. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నందుకు.. గత ఎన్నికల్లో ఓడిపోయినందుకు.. జగన్ సహా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే తాజాగా ఆ పార్టీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. ప్రతిపక్షంలో ఉండడం గొప్ప అవకాశమని వ్యాఖ్యానించారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సంఘాలు, నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చిందని చెప్పారు. “ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం” అని అన్నారు.
ఇక, బీసీలకు సంక్షేమం అనేది జగన్‌తోనే సాకారం అయిందని సజ్జల చెప్పారు. “బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వమే. బీసీ కులాలకు గుర్తింపును, సమాజంలో చైతన్యంను తీసుకొచ్చి వైభవం తీసుకొచ్చి పెద్దపీట వేసింది. వెనుకబడిన కులాలకు ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ది ఫలాలు అందాలని జగన్ హయాంలో మేలు చేశారు. వెనకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి, జగన్ వల్ల మాత్రమే భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని వారి చెప్పాలి.” అని నాయకులకు సజ్జల సూచించారు.
దీనికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, ఇక ఏ మాత్రం జాప్యం తగదని సూచించారు. జగన్ ఆలోచనలు, విధానాలను బీసీ కులాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం సమన్వయంతో అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. “ఐదేళ్ళలో మనం ప్రజలకు చేసిన మంచి ఎక్కడికీ పోలేదు, అందరికీ అర్ధమవుతోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసిగెత్తిపోయారు, టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. దానిని మనం ధీటుగా ఎదుర్కోవాలి” అని సజ్జల సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates