పులివెందుల నియోజకవర్గంలో తమకు తిరుగులేదని భావిస్తూ వచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాల్లో ఇబ్బందికర పరిణామాలు తప్పవనే సంకేతాలు తెర మీదకు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేసిన ప్రకటన పులివెందుల రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం ఖాయం అన్న సంకేతాలను షర్మిల ఇచ్చేశారు. సమయానికి అనుకూలంగా రాజకీయాల్లో రాజారెడ్డి వస్తాడన్నారు.
తాజాగా షర్మిల కర్నూలు జిల్లా పర్యటనలో రాజారెడ్డి విషయాన్ని ప్రకటించారు. అయితే ఆమె పక్కా వ్యూహంతోనే ఉన్నారన్నది స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి మూడున్నర సంవత్సరాల సమయం ఉంది. ఈ సమయంలోగా తన కుమారుడు రాజారెడ్డిని యాక్టివేట్ చేయటం, రాజకీయ వర్గాల్లో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని అనుకూలంగా మలచడం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పరిచయం చేసే కార్యక్రమాలు కూడా మునుముందు జోరుగానే సాగనున్నాయని తెలుస్తోంది. వైయస్ కుటుంబం నుంచి చూస్తే రాజారెడ్డి కనక రాజకీయాల్లోకి వస్తే నాలుగో తరం వారసుడు రంగ ప్రవేశం చేసినట్టు అవుతుంది.
గతంలో రాజారెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, రేపు రాజారెడ్డి గనక రంగ ప్రవేశం చేస్తే వైఎస్ వారసుడిగా ఆయన పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. పైగా.. ముత్తాత పేరు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించినా ఆశ్చర్యం లేదన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. గత ఎన్నికల్లోనే కడపలో అవినాష్ రెడ్డిని ఓడించే ప్రయత్నం చేసిన షర్మిల.. వచ్చే ఎన్నికల నాటికి నేరుగా తన అన్న జగన్‌నే టార్గెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదని, దీనికి తన కుమారుడుని వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే అవకాశం స్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఈ లోగా రెండు మూడు కార్యక్రమాల ద్వారా హైలెట్ చేసి తన కుమారుడిని రాజకీయంగా ఆక్టివేట్ చేసేందుకు షర్మిల ప్రయత్నం చేయొచ్చు. వచ్చే ఎన్నికల నాటికి తన సోదరుడికి బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టినా ఆశ్చర్యం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు.. కాబట్టి మేనమామపై మేనల్లుడు రాజా పోటీ చేసే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం కూడా. ఎందుకంటే.. వైఎస్ వారసుడిగా జగన్‌నే గుర్తిస్తున్న దరిమిలా.. ఇప్పుడు రాజారెడ్డిని ఎంట్రీ చేయిస్తే.. ఆ ఇంపాక్ట్ ఇటు వైపు మళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. సో.. మొత్తానికి జగన్‌కు.. వచ్చే ఎన్నికల్లో సొంత మేనల్లుడే ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates