జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల ఢిల్లీ టూరుకు వెళ్ళారనగానే ఏపి బేజేపీలో టెన్షన్ మొదలైందట. ఎక్కడ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధికి హామీ తీసుకుంటారో అనే ఆందోళన పెరుగుతోందని సమాచారం. నిజానికి పవన్ ఢిల్లీ టూరు అజెండా ఎవరికీ తెలీదు. ప్రతిపక్షాల అధినేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం అవబోతున్నారట. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ కు కూడా ఆహ్వానం అందిందని చెబుతున్నారు.
సరే పవనే అపాయిట్మెంట్ తీసుకుని వెళ్ళినా లేకపోతే నడ్డానే పిలిపించుకున్నా విషయం ఏమిటే భేటి జరగుతోంది. మరి నడ్డాతో భేటి అంటే పవన్ కు గట్టి అజెండానే ఉంటుందని అనుకుంటున్నారు. ఇఫ్పటికిప్పుడు ముఖ్యమైన అజెండా ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికలు, తర్వాత తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలే అన్నది అందరికీ తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగూ ప్రచారం చేయటానికి పవన్ కమిట్ అయ్యారు కాబట్టి చేయక తప్పదు.
కాకపోతే ఎన్ని డివిజన్లు, ఏ ఏ తేదీల్లో ప్రచారం చేయలన్నది తేలాలంతే. ఈ విషయాన్ని రాజధానిలో బీజేపీ నేతలు, పవన్ కలిసి కూర్చుంటే క్లారిటి వచ్చేస్తుంది. కాబట్టి ఇంతచిన్న విషయాన్ని నడ్డాతో ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఇక మిగిలింది తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలే. ఈ విషయంలోనే ఏపి బిజేపీ నేతల్లో టెన్షన్ మొదలైపోయిందట. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తాడంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించేశారు. అప్పటి నుండి పవన్ కు వీర్రాజుపై మండుతోందని సమాచారం.
అందుకే తమ భేటిలో ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధినే పోటీ చేయించేందుకు నడ్డా నుండి పవన్ హామీ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికలో బీజేపీ అభ్యర్ధికన్నా జనసేన మద్దతుతో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని లెక్కలతో సహా వివరించబోతున్నారట. బీఎస్పీకన్నా తమ పార్టీనే బలంగా ఉంది కాబట్టి పోటీ చేసే అవకాశం జనసేనకే ఇవ్వాలని పవన్ పట్టుబట్టబోతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి పవన్ వాదనకు నడ్డా ఎంతమాత్రం ఏకీభవిస్తారా లేకపోతే తమకు అనుకూలంగా పవన్నే కన్వీన్స్ చేస్తారా అన్నది చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates