ముహూర్తం పెట్టేశారు.. జ‌గ‌న్ తేల్చేశారు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 18 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుమారు వారం రోజులపాటు జరుగుతాయని అధికార పార్టీ వర్గాల్లో అంచనా ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఈ దఫా అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాదిన్నర కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరిపాలన సహా ప్రతిపక్షం చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

ఈ క్ర‌మంలో అధికారపక్షం దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని అరికట్టే దిశగా చట్టం తీసుకువచ్చే అవకాశం కూడా ఈ సమావేశాల్లోనే ఉందని కూటమి పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నకిలీ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రత్యేక చట్టం తీసుకురావడం ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆయన ఇటీవల నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమంలో కూడా వ్యాఖ్యానించారు.

దీనిపై సీఎం చంద్రబాబు కూడా దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఎంతో మంచి చేస్తున్నప్పటికీ ప్రతిపక్ష వైసిపి సహా ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారం కారణంగా ప్రజల్లో అనుకున్న స్థాయిలో గ్రాఫ్ రావడం లేదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల్లో కచ్చితంగా ఈ నకిలీ ప్రచారానికి అడ్డుకట్ట వేసే దిశగా కొత్త చట్టం తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైసిపి విషయానికి వస్తే ఈ సమావేశాలకు కూడా తాము వచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు.

తాజాగా పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. సభకు వెళ్లి అభాసుపాలు కావడం అనవసరమని ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పుడు సభకు వెళ్లినా మాట్లాడే అవకాశం ఇవ్వబోరని ఆయన చెప్పారు. అలాంటప్పుడు సభకు వెళ్లకుండా ఉండటమే మంచిది అన్నది జగన్ ఆలోచన. ఆది నుంచి కూడా ఆయన అసెంబ్లీకి దూరంగానే ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి 11 స్థానాలకు పరిమితమైన తర్వాత వైసిపి నుంచి ఒక నాయకుడు కూడా ఇప్పటివరకు సభకు హాజరు కాలేదు.

కేవలం ప్రమాణస్వీకారాలకు మాత్రమే హాజరయ్యారు. ఇక ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత కూడా సభకు వెళ్లకూడదు అన్న నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీలో కొంతమందికి అసంతృప్తిగాను, కొంతమందికి ఆనందంగానూ ఉండడం విశేషం. జగన్‌ను సమర్ధించేవారు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా తటస్థంగా ఉండే నాయకులు మాత్రం సభకు వెళ్లకపోతే ప్రజలకు ఏం చెబుతామన్నది ఆవేదనగా ఉంది. మొత్తంగా జగన్ అయితే తేల్చేశారు. సభకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.

సభ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించడం మీడియాతో మాట్లాడటం ద్వారా సభలో జరుగుతున్న కార్యకలాపాలపై తమ వాయిస్ వినిపించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మరి దీన్ని ఎంతమంది ఫాలో అవుతారు అనేది చూడాలి .ఇక ఈసారి చిత్రం ఏంటంటే సభకు రాకుండా ప్రశ్నలు అడిగే వారిని అనుమ‌తించేది లేద‌ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అంటే సభకు వెళ్లకుండా ప్రశ్నలు అడిగితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రశ్నలకు సభలో సమాధానం ఇవ్వరు. కాబట్టి ఇది ఒక రకంగా వైసీపీకి ఇబ్బందికర పరిణామం. అయినప్పటికీ సభకు వెళ్లేది లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చూడాలి.