జగన్ ముందు గండం!… దొడ్డి దారీ సిద్ధం!

అదేంటో గానీ అధికారంలో ఉన్నన్నాళ్లు కడుపులో చల్ల కదలకుండా సాగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం దూరం కాగానే… గండాల మీద గండాలు ముంచుకొస్తున్నాయి. ఆ గండాలను ఎలాగోలా తప్పించుకుని ఆయన ముందుకు సాగుతున్నారు. తాజాగా జగన్ ముందు మరో గండం పొంచి ఉంది. అయితే ఆ గండం నుంచి తప్పించుకునేందుకు గతంలో ఆయన అనుసరించిన దొడ్డిదారి మార్గాన్నే ఈ దఫా కూడా అనుసరిస్తారని చెప్పక తప్పదు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణే ఆ గండం కాగా… 60 రోజుల గైర్హాజరు మీరితే.. ఓ రోజు అలా వెళ్లి ఇలా సంతకం చేసి వచ్చేస్తారన్న మాట.

ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18 నుంచి నిర్వహించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. సర్కారు ప్రతిపాదన మేరకు అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ లో అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీ ఉన్నా… తొలి రోజు జరిగిగే శాసన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) ఎన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్న విషయాన్ని నిర్ధారిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ అండ్ కో మొన్నామధ్య సంతకం పెట్టాక దాదాపుగా 37 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇంకో 23 రోజుల సమావేశాలకు వీరు గైర్హాజరు అయితే జగన్ సహా అందరిపై అనర్హత వేటు పడినట్టే.

ఇక ఇదిలా ఉంటే… అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ నుంచి నోటిఫికేషన్ రాగానే… అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు వెరైటీగా స్పందించారు. ఈ సమావేశాలకు జగన్ సహా వైసీపీ సభ్యులంతా హజరు కావాలని ఆయన కోరారు. అలా కాదని గతంలో మాదిరే ఈ దఫా కూడా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొడితే… వారి సభ్యత్వాలు వాటికవే రద్దు అయిపోతాయని ఆయన హెచ్చరించారు. అదే జరిగితే జగన్ మాజీ ముఖ్యమంత్రిగానే కాకుండా మాజీ ఎమ్మెల్యేగానూ మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. పులివెందుల అసెంబ్లీకీ ఉప ఎన్నిక వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా రాజు చురకలంటించారు.

గడచిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో 151 సీట్లు ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో షాక్ తిన్న జగన్… తన పాలనలో అసెంబ్లీలో ఏ తీరున వ్యవహరించానన్న విషయాన్ని గుర్తు చేసుకున్న జగన్.. కూటమి సభ్యులు తనను హ్యుమిలియేట్ చేయడం తప్పనిసరి అని గ్రహించి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు ఓ సారి, అనర్హత వేటు తప్పించుకునేందుకు మరోమారు మాత్రమే వైసీపీ సభ్యులు సభకు వచ్చారు. తాజాగా 60 రోజుల గడువు దగ్గరకు వస్తే మరోమారు వారు అసెంబ్లీకి వచ్చి గండం నుంచి బయటపడతారు.