తెలంగాణ జనం ఇప్పుడు ఓ అంశంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక మేథావి వర్గం అయితే…ఈ చర్చలపై రకరకాల విశ్లేషణలతో వారివారి వాదనలను వినిపిస్తున్నారు. అదేంటంటే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేతను కాళేశ్వరం కేసులో కాపాడేందుకు యత్నించారా? లేదంటే పూర్తిగా ఇరికించేశారా? అన్నదే ఆ చర్చ. కాళేశ్వరంలో చిల్లిగవ్వ అవినీతి కూడా జరగలేదని బీఆర్ఎస్ బల్లగుద్ది మరీ చెబుతుంటే… కవిత మాత్రం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఓ సర్టిఫికెట్ ఇచ్చి పడేశారు.
నేరుగా కవిత ఆ మాట అనకున్నా… కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ రావులకు పాత్ర ఉందని చెప్పడం ద్వారా ఆమె అవినీతిని ధృవీకరించినట్టైంది. కాళేశ్వరం అవినీతి మరకలను తన తండ్రి కేసీఆర్ కు హరీశ్, సంతోష్ లే అంటించారని కవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రూలింగ్ ఇచ్చినట్టే కదా. అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న పార్టీకి చెందిన కీలక నేత, ఆ పార్టీ అదినేత కుమార్తె స్వయంగా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే… అవినీతి జరగలేదని ఎలా వాదించేది? నిజమే మరి… మంగళవారం నుంచి కాళేశ్వరంలో అవినీతి జరగలేదని బీఆర్ఎస్ చేసే వాదనలను వైరి వర్గాలు అలా ఈజీగా కొట్టిపారేస్తాయి.
హరీశ్, సంతోష్ లు తన తండ్రికి అవినీతి మరకలు అంటించారని కవిత చెబితే… మరి నాడు ప్రభుత్వాధినేతగా, ముఖ్యమంత్రిగా, మంత్రిమండలికి మార్గదర్శకుడిగా కొనసాగిన కేసీఆర్ కు కూడా అవినీతి అంటినట్టే కదా. మరి ఈ వాస్తవాన్ని మరిచిన కవిత…కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, తన తండ్రికి మాత్రం ఏ పాపం తెలియదని చెబితే ఎవరూ నమ్మరు కదా. ఇప్పుడు కవిత పరిస్థితి కూడా అదేనని చెప్పక తప్పదు. అసలు కవిత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా ఏ ఆశించి అంత సంచలన వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఏ ఒక్కరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఈ లెక్కన కవిత ఏ లెక్కలు వేసుకుని మీడియా ముందుకు వచ్చారో తెలియదు కానీ… తన వ్యాఖ్యల ద్వారా తన తండ్రి కేసీఆర్ ను కాపాడటానికి బదులుగా అడ్డంగా ఇకిరించి పరేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఇంకాస్త దూరం ఆలోచిస్తున్న మేథావులు… కవిత కావాలనే ఇదంతా చేస్తున్నారన్న వాదనలనూ వినిపిస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి దూరంగా జరగాలని తాను ఎన్నో రోజులుగా చూస్తుంటే… పార్టీ బయటకు పంపడం లేదని, ఈ వ్యాఖ్యలతో అయినా తనను సస్పెండ్ చేస్తే వేరు కుంపటి పెట్టుకోవచ్చన్న భావనతో, తనను సస్సెండ్ చేశారన్న వాదనను సింపతీగా మలచుకోవాలన్న భావనతోనే ఆమె సాగుతున్నట్లుగా మరికొందరు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates