అవును మీరు చదివింది నిజమే. వినటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా మామూలు జనాలతో పాటు పార్టీలో కూడా ఇదే విధమైన చర్చ జరుగుతోంది. విషయం ఏదైనా కానీండి ముందు భీకరమైన ప్రకటన చేసేయటం తర్వాత ఆచరణలోకి వచ్చేసరికి తుస్సుమనిపించటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మామూలైపోయింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ఎపిసోడ్ ను చూస్తే అందరికీ బాగా అర్ధమైపోతుంది. ముందేమో జీహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందంటూ ప్రకటించేశారు. 20 మందితో జాబితాను కూడా మొన్నటి గురువారం రిలీజ్ చేసేశారు.
తర్వాత అభ్యర్ధులు దొరకలేదో ఏమో. వెంటనే బీజేపీతో పొత్తులంటూ లీకులు వదిలారు. దానికి బీజేపీ అధ్యక్షుడ బండి సంజయ్ గట్టిగా రిటార్టిచ్చారు. జనసేనతో తమకు పొత్తే ఉండదని బహిరంగంగానే ప్రకటించటంతో పవన్ కు దిమ్మతిరిగింది. దాంతో ఏమి చేయాలో తోచక తెరవెనుక పావులు కదిపారు. దాని ఫలితమే చివరకు జనసేన పోటీ నుండి విరమించుకోవటం. బీజేపీకి ప్రచారం చేయమని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షు డు లక్ష్మన్ అడిగారు కాబట్టి తాము పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే తెలంగాణాలో 2018లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఎన్నికల షెడ్యూల్ కు ముందు బాగా హడావుడి చేసి ముందస్తు ఎన్నికల్లో పాల్గొనేది లేదంటూ ప్రకటించేశారు. 2019 ఏపి ఎన్నికల విషయానికి వస్తే పార్టీకి స్పష్టమైన విధానం అంటు లేకుండా చేసుకున్నారు. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాకపోయేసరికి ఎన్నికలైపోయిన వెంటనే ఆ పార్టీలకు కనీసం చెప్పకుండానే బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నారు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ అవినీతిని ఏమాత్రం ప్రశ్నించారో ఎవరికీ తెలీదు.
ఒకసారి చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉంటారు. కొద్ది రోజులు చంద్రబాబు+లోకేష్ పై తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. ఈ కారణం వల్లే పవన్ కు ప్యాకేజీ స్టార్ అనే ముద్ర వేసేశారు వైసీపీ నేతలు. ప్యాకేజీ జేబులో పడగానే చంద్రబాబుకు పవన్ మద్దతుగా మాట్లాడుతాడంటు ఎద్దేవా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి పవన్ అంటే జనాల్లో మంచి క్రేజుంది. అయితే స్ధిరమైన అభిప్రాయాలు లేకపోవటం, ఈరోజు చెప్పిన మాటకు మరుసటి రోజు విరుద్దంగా వ్యవహరించటం వల్లే జనాల్లో నమ్మకాన్ని కోల్పోయారు.
పార్టీ పెట్టినప్పటి నుండి నికార్సయిన ప్రతిపక్షంగా ఉండుంటే పవన్ అంటే జనాల్లో నమ్మకం ఏర్పడేది. ఎవరితోను కలవకుండా నిజమైన ప్రతిపక్షంగా జనాల నమ్మకం కోసం కష్టపడుంటే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ-జనసేన మధ్యే ఫైట్ నడిచేదేమో. లేకపోతే పూర్తిగా టీడీపీకి మిత్రపక్షంగా అన్నా పనిచేసుండాలి. పూటకో మాట రోజుకో వైఖరి మారుస్తుండటం వల్లే పవన్ ను జనాలు నమ్మటం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా జనాల నమ్మకాన్ని పవన్ పొందుతారని ఎవరు అనుకోవటం లేదు. జరుగుతున్నది చూస్తుంటే జనసేన ఎదుగుదలకు పవనే అడ్డంకిగా మారినట్లు అర్ధమైపోతోంది.