విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు, ప్రత్యేకంగా వీరికోసమే!

విశాఖ‌ప‌ట్నానికి సీఎం చంద్ర‌బాబు డ‌బుల్ డెక్క‌ర్ వ‌న్నెలు తెచ్చారు. తాజాగా ప‌ర్యాట‌కుల కోసం.. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను ఆయ‌న ప్రారంభించారు. విశాఖ ప్ర‌స్తుతం ప‌ర్యాట‌క ప్రాంతాల్లో నెంబ‌ర్ 1గా ఉంద‌ని.. దీనికి మ‌రింత శోభ‌ను చేకూర్చేందుకు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్టామ‌ని సీఎం తెలిపారు. శుక్ర‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. సాయంత్రం విశాఖ‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రామ‌కృష్ణా బీచ్‌లో వీటిని ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం.. పార్టీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి కొద్ది దూరం ప్ర‌యాణించారు.

నిత్యం ప‌ర్యాట‌కుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఈ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు.. ఏపీలోను, ముఖ్యంగా విశాఖ‌లోనూ తీసుకురావ‌డం ఇదే తొలిసారి. జిల్లాలో నిత్యం ఆర్కే బీచ్ నుంచి మ‌రో ప‌ర్యాట‌క ప్రాంతం తొట్లకొండ మ‌ధ్య ఈ బ‌స్సులు సేవ‌లు అందిస్తాయి. మొత్తం 16 కిలో మీట‌ర్ల మేర ఈ బ‌స్సులు ప్ర‌యాణించ‌నున్నాయి. ఇవి పూర్తిగా హ‌రిత ఇంధ‌న మైన విద్యుత్‌తోనే న‌డ‌వ‌నున్నాయి. బ‌స్సుల‌ను ప్రారంభించిన అనంత‌రం చంద్ర‌బాబు వాటిలో కొద్ది దూరం ప్ర‌యాణించి.. విశాఖ తీర అందాల‌ను ఆస్వాదించారు. బ‌స్సులో కూర్చుంటే.. విశాఖ న‌గ‌రం మొత్తం క‌నిపించేలా డిజైన్ చేశార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.

అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. విశాఖ‌ను రాజ‌ధానిగా చేస్తామ‌ని గ‌త పాల‌కులు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పార‌ని.. బంగారం వంటి అమ‌రావ‌తిని అట‌కెక్కించార‌ని విమ‌ర్శించారు. అయినా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించార‌ని చెప్పారు. కూట‌మికి ఇక్కడి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని అన్నారు. ఆసియా టెక్నాలజీ హబ్‌గా, రాష్ట్ర ఆర్థిక, ఐటీ క్యాపిట‌ల్‌గా విశాఖ ప‌ట్నం మారుతోంద‌ని, భ‌విష్య‌త్తులో ఈ న‌గ‌రం ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా ఉంటుంద‌ని చెప్పారు. త్వరలో డేటా సెంటర్‌, సీ కేబుల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేబుల్‌ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని చంద్ర‌బాబు చెప్పారు. దేశంలోని ప‌లు న‌గ‌రాల‌తో విశాఖ పోటీ ప‌డుతూ.. అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోంద‌ని వివ‌రించారు.