“చేసిన మంచిని మరిచి.. నన్ను తిడుతున్నారు“- అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా.. తాను బాధపడడం లేదని, ఇంకా మంచి చేయాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు. తాజాగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న `సేనతో సేనాని` కార్యక్రమంలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి దారుణ హత్య, అనంతర పరిణాలను ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
2017-18 మధ్య సుగాలి ప్రీతి హత్యకు గురైంది. అయితే.. ఈ కేసులో నిందితులు ఇప్పటి వరకు పట్టుబడలేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో జనసేన అధిపతిగా.. ఆనాడు పవన్ కల్యాణ్.. కర్నూలులో ఈ విషయంపై కదం తొక్కారు. ఫలితంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే.. నాడు పవన్ తమకు ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదని.. ఆయనపై తమకు నమ్మకం పోయిందని ఇటీవల సుగాలి ప్రీతి మాతృమూర్తి పార్వతి మీడియా ముందు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేశారు.
ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన పవన్ కల్యాణ్.. పార్వతి తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. “మంచిని మరిచి.. నన్ను తిడుతున్నారు“ అని అన్నారు. అందరూ మరిచిపోయిన పరిస్థితిలో సుగాలి ప్రీతి కేసును తానే భుజాన వేసుకుని కర్నూలులో ఉద్యమం సృష్టించానని చెప్పారు. దీంతో దిగి వచ్చిన అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ కుటుంబానికి 5 ఎకరాల పోలం, 500 సెంట్ల భూమిని, సుగాలి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందన్నారు. అదేసమయంలో 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చారని తెలిపారు.
వీటితోపాటు.. ఈ కేసును సీబీఐకి అప్పగించేలా కూడా తాను అప్పట్లో ఒత్తిడి తెచ్చానని గుర్తు చేశారు. తాను ఇంత చేస్తే.. ఇప్పుడు తనపైనే పార్వతి విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని వ్యాఖ్యానించారు. అయినా.. తాను బాధపడడం లేదని.. ఓ ఆడకూతురుకి న్యాయం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates