కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు నలుగురు వైసీపీ తో టచ్‌లో ఉన్నారు. మరో రాజ్యసభ సభ్యుడు ఏకంగా మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యారు. తనకు ఖర్గేతో 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉందని.. అందుకే కలిశానని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ అధినేత సదరు నేతను వివరణ కోరినట్టు తెలిసింది. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చిదంబరం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లు వచ్చాయని సమాచారం.
వచ్చే నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాలని ఆయనను అభ్యర్థించారు. అయితే.. దీనికి వైసీపీ నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదిలావుంటే.. అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ నేతల వైఖరిపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేసి నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకులను కూడా ఆయన మందలించినట్టు తెలిసింది. అసలు వారు ఫోన్లు చేస్తే.. మీరెందుకు రిసీవ్ చేసుకున్నారని.. ప్రశ్నించినట్టు సమాచారం.
“నాపై కేసులు పెట్టిన విషయం.. మన పార్టీని ఇరుకున పెట్టేలా.. ఇప్పటికీ షర్మిలతో మాట్లాడిస్తున్న విషయం మీకు తెలియదా. ఎవడో మాణిక్కం ఆయన కూడా మనపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే.. మనం ఎందుకు స్పందించాలి. ఇక, నుంచి ఫోన్లు కూడా తీయొద్దు.” అని సీరియస్ గా చెప్పేశారని.. తాడేపల్లి కార్యాలయానికి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు ఆఫ్‌దిరికార్డుగా మీడియా మిత్రులకు చెప్పుకొని రావడం గమనార్హం.
ప్రస్తుతం కాంగ్రెస్‌కు వైసీపీ మద్దతు ఉన్నా.. లేకున్నా.. తటస్థంగా వ్యవహరిస్తే తమకు మేలు జరుగుతుందని చెబుతోంది. “నేరుగా మాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి. అదే మేం కోరుతున్నాం” అని ఖర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీయేలో లేని పార్టీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన విన్నవిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో లేదు. తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా మచ్చిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వైసీపీ మాత్రం కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates