కాపు సామాజిక వర్గాన్ని ఖుషీ చేసిన చంద్రబాబు..

సామాజిక వర్గాల ఆధారంగా రాజకీయాలు జోరందుకున్న ఏపీలో పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఆయా వర్గాలను సంతృప్తి పరిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రంలో తాజాగా సీఎం చంద్రబాబు చేసిన కీలక నిర్ణయం కాపు సామాజిక వర్గాన్ని మరింత ఖుషీ చేసింది. అయితే దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. నిర్ణయాన్ని నిర్ణయంగానే చూడాలని, సామాజిక వర్గంతో ముడిపెట్టడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజకీయాలు, ప్రభుత్వాల నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా దాదాపు ఇలానే ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల వాదనగా ఉంది.

ఏం జరిగింది?

తెలుగు అధికార భాషా సంఘానికి ఇప్పటి వరకు ఏపీలో ఎవరి పేరూ లేదు. గతంలో వైసీపీ హయాంలో ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రతిపాదన తెరమీదకు వచ్చినా అప్పటి సీఎం జగన్ పెడచెవిన పెట్టారు. ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేసిన దరిమిలా అధికార భాషా సంఘానికి అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవ‌ల ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు భాషా ప్రేమికుడు మండలి వెంకట కృష్ణారావు పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఈ క్రంలో తాజాగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో తెలుగు అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరును ప్రతిపాదించగా మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. మండలి కుమారుడు బుద్ధ ప్రసాద్ ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీలోనూ, అంతకుముందు కాంగ్రెస్‌లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకట కృష్ణారావు పేరును పెట్టడం పట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది.

“ఇన్నాళ్లకు మండలికి మంచి గుర్తింపు వచ్చింది” అని పలువురు వ్యాఖ్యానించడంతో పాటు మండలి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అయితే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వ నిర్ణయంగానే చూడాలని పేర్కొన్నారు. తటస్థులు కూడా దీనిని మంచి నిర్ణయంగానే పేర్కొనడం విశేషం. ఏదేమైనా మండలికి తగిన గుర్తింపు లభించిందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.