ఉత్తరాదికి కొమ్ముకాయ‌ని పార్టీలు.. క‌లిసి రండి: ష‌ర్మిల

ఉత్త‌రాది నాయ‌కుల‌కు, పార్టీల‌కు కొమ్ముకాయ‌ని పార్టీలు.. త‌మ‌తో క‌లిసి రావాల‌ని.. ఏపీలోని అధికార‌, విప‌క్ష పార్టీల‌ను ఉద్దేశించి కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్త‌రాది పార్టీనే. కానీ, ఆమె ఆవేశంలోనో.. ఆక్రోశంలోనో ఈ విష‌యాన్ని మ‌రిచిపోయారు. ఇక‌, విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు చెందిన మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డిని ఎంపిక చేసింది. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే బాధ్య‌త‌ను రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు స‌హా మిత్ర‌ప‌క్షాల‌కు పార్టీ అప్ప‌గించింది.

ఈ నేప‌థ్యంలో ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల‌.. ఏపీలో టీడీపీ, వైసీపీ అధినేత‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌రాది పార్టీల‌కు కొమ్ము కాయ‌కుండా.. తెలుగువారైన జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డికి సీఎం చంద్ర‌బాబు, మాజీ సీఎంజ‌గ‌న్‌లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని, ఆయ‌న విజ‌యానికి స‌హ‌క‌రించాల‌ని అభ్య‌ర్థించారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణమ‌న్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టీ న్యాయ నిపుణుడికి అవకాశం ఇవ్వడం హర్షణీయమ‌ని పేర్కొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన సుదర్శన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగార‌ని తెలిపారు.

దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి న్యాయరంగ నిపుణులు ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటేనే రాజ్యాంగ పరిరక్ష‌ణ సాధ్య‌మ‌వుతుంద‌ని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే సమయం వ‌చ్చింద‌ని తెలిపారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదని, ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఆయన స్వ‌తంత్ర నిపుణుల‌ కమిటీ చైర్మన్ అని తెలిపారు.

సుదర్శన్ రెడ్డిని తెలుగు బిడ్డగా పరిగనణలోకి తీసుకుని, న్యాయరంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ- రాజకీయాలు ఆపాదించకుండా టీడీపీ, జనసేన, వైసీపీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాన‌ని ష‌ర్మిల విజ్ఞ‌ప్తి చేశారు. దీనికి చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే.. తాను వ్య‌క్తిగ‌తంగా వారిని క‌లుసుకుని విజ్ఞప్తి చేయ‌నున్న‌ట్టు కూడా ష‌ర్మిల తెలిపారు.