తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు లేఖలు రాయనున్నట్టు తెలిపారు. అదేసమయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబులకు కూడా ఆయన ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. “మాకు సహకరించండి. మన తెలుగువారైన.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి చేయి కలపండి” అని రేవంత్ రెడ్డి విన్నవించారు. సుదీర్ఘ కాలం తర్వాత.. తెలంగాణ వారికి.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో కూర్చుకునేందుకు అవకాశం వచ్చిందన్న రేవంత్‌రెడ్డి.. దీనికి తెలుగు వారిగా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నేను చెప్పేది ఏంటంటే..
ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అవకాశం తొలిసారి తెలంగాణకు దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని గర్వకారణంగా భావించాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయ బేధాభిప్రాయాలకు తావులేకుండా వ్యవహరించాలని, తెలుగు వారంతా ఏకతాటిపై నిలుస్తారన్న సందేశాన్ని పంపించాలని ఆయన విన్నవించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌లు తమకు మద్దతుగా నిలవాలన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరో పక్షం ఎంఐఎంలు కూడా కలిసి రావాలని అన్నారు.
ఇండియా కూటమి తరఫున తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేయడం పట్ల తాము ఎంతో సంతోషిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో పీవీ నరసింహారావుకు ప్రధానిగా చేసే అవకాశం వచ్చిందని.. మళ్లీ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం తెలంగాణ వాసికి లభించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు లభించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి తాను వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అప్పట్లో నరసింహారావుకు.. దివంగత ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి చంద్రబాబు మద్దతు ఇవ్వాలన్నారు.
కేంద్రంపై విమర్శలు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్వవస్థలను కేంద్రంలోని ఎన్డీయే అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతోందని తెలిపారు. ఎన్డీయే కూటమి మాత్రం.. రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని రక్షించే కూటమికి అందరూ మద్దతు ఇవ్వాలని విన్నవించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates