కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య వివాదాలు భగ్గుమంటున్నాయి. కొన్ని కొన్ని చోట్ల మాత్రం సర్దుకు పోతున్నారు. ఇలాంటి వాటిలో పాలకొండ ఒకటి. మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ.. గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు టీడీపీ నాయకుడే. కానీ.. ఆయనకు అనూహ్యంగా జనసేన టికెట్ ఇవ్వడం.. ఆయన పార్టీ మారిపోవడం తెలిసిందే. పైగా.. వైసీపీకి నిన్నటి వరకు కంచుకోటగా ఉన్న చోట ఆయన విజయం కూడా దక్కించుకున్నారు.
టీడీపీ నుంచి వచ్చిన జయకృష్ణకు.. ఇప్పుడు టీడీపీ నుంచే సెగ తగులుతోంది. టీడీపీ సీనియర్లు.. ఇక్కడ అప్రకటిత ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన రగిలిపోతున్నారు. దీంతో నేరుగా దూషణలకు కూడా దిగుతున్నారు. వరుస ఓటములు ఎదుర్కొన్న జయకృష్ణను.. తామే గెలిపించామని సీనియర్లు చెబుతున్నారు. ఇది మరింతగా నిమ్మకు ఇబ్బందిని కల్పిస్తోంది. ఇది మెల్లిగా ఆధిపత్య రాజకీయాల దిశగా అడుగులు వేసేలా చేసింది. తనను కాదని.. తనను కనీసం సంప్రదించకుండానే.. స్థానిక టీడీపీ నేత ఒకరు వ్యవహారాలు చక్కబెడుతున్నారన్నది ఆయన చేస్తున్నవాదన.
ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో తన అనుమతి కూడా లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని.. పింఛన్ల పంపిణీ నుంచి ఇతర పథకాల వరకు కూడా తమకు కనీసం చెప్పడం లేదని నిమ్మక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి తాము టెక్నికల్‌గా ఇక్కడ పోటీ చేయక పోయినా .. తమ అధినేత సూచనలతోనే నిమ్మకకు టికెట్ వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. జనసేనలో ఉన్నవారు.. ఎమ్మెల్యేతీరును ఎండగడుతున్నారు. తమకు పనులు చేయడం లేదని అనేవారు కొందరైతే.. మరికొందరు అసలు ఎమ్మెల్యేగా ఆయన తన హక్కులే సాధించుకోలేక పోతున్నారని అంటున్నారు.
ఇదే విషయాన్ని నిమ్మక ఇటీవల ప్రస్తావించారు. “పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పాలకొండలో ఏం చేయ లేకపోతున్నా” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు ఆధిపత్యంతో వ్యవహరిస్తున్నా రని.. వారివల్లే ఇబ్బందులు వస్తున్నాయని నిమ్మక చెబుతున్నారు. కానీ, వారంతా సీనియర్లు కావడంతో తానేమీ చేయలేక పోతున్నానని అంటున్నారు. ఈ వ్యవహారం.. జయకృష్ణకు ఇబ్బందులు తెస్తోంది. ముఖ్యంగా టీడీడీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి వ్యవహారంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో సుపరిపాలనలో తొలి అడుగు వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిపోయాయని అంటున్నారు.
ఈ వ్యవహారం ముదురుతుందా? లేక.. మధ్యలోనే సమసిపోతుందా? అనేది చూడాలి. ఇదిలావుంటే.. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. పాలకొండ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ప్రజల మధ్య తిరుగుతూ.. అనవసరంగా నిమ్మకను గెలిపించారని ప్రజలకు నూరిపోస్తున్నారు. దీంతో అటు టీడీపీ నుంచిఇటు వైసీపీ నుంచి కూడా జనసేన ఎమ్మెల్యేకు సెగ తగులుతోందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates