టీవీ ఛానెళ్లు నిర్వహించే చర్చలు.. ఈ సందర్భంగా పార్టిసిపెంట్లు చేసే వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేసింది. “ఏదైనా చర్చలో పాల్గొనే పార్టిసిపెంట్లు.. వివాదాస్పద, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు, అంశాలు లేవనెత్తినప్పుడు.. యాంకర్లు.. వినోదం చూడడం సరికాదు. వాటిని అరికట్టండి. సదరు పార్టిసిపెంట్లను కట్టడి చేయండి. అవసరమైతే.. మీ చేతిలోనే రిమోట్ పెట్టుకుని వారి వాయిస్‌ను నిలువరించిండి. అంతేకానీ.. మీకు సంబంధం లేదని చూస్తూ కూర్చోవద్దు.” అని సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
విషయం ఇదీ..
రెండు మాసాల కిందట సాక్షి ఛానెల్‌లో అమరావతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణం రాజు అనే వ్యాఖ్యాత.. అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో డిబేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు.. స్పందించారు. ఔనను.. నేను కూడా చదివాను.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొమ్మినేనిని అరెస్టు చేసి గుంటూరు జైల్లో పెట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్‌ను తెచ్చుకున్నారు కొమ్మినేని.
తాజాగా ఈ మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్(అంటే.. కేసు పరిష్కారం అయ్యే వరకు బెయిల్ పొందడం)గా మార్పు చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కొన్ని ఆంక్షలు విధిస్తూ.. రెగ్యులర్ బెయిల్‌గా మార్చింది. న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ సమయంలో ఏపీ సర్కారు అభిప్రాయం కోరింది. కొమ్మినేనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పింది.
దీంతో యాంకర్‌గా నిర్వహించే చర్చల్లో పార్టిసిపెంట్లు ఎలాంటి పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా చూడాలని, ఒకవేళ ఏదైనా వ్యాఖ్య చేస్తే వారిని అడ్డుకోవాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే.. పార్టిసిపెంట్ల వ్యాఖ్యలను మ్యూట్ చేసేలా చేతిలో రిమోట్ పెట్టుకోవాలని ధర్మాసనం చూసించింది. అనంతరం కొమ్మినేనిని రెగ్యులర్ బెయిల్ ఇస్తూ.. తీర్పు చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates