పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ, ఢిల్లీలో హై టెన్షన్

2024 లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆ బాంబు పేలుస్తానని రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడాన్ని రాహుల్ గాంధీ, విపక్ష పార్టీల ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి నేడు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేయాలని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని అడ్డుకునేందుకు సంసద్ మార్గ్ రోడ్డుకు అడ్డంగా పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయితే, కొందరు ఎంపీలు బారికేడ్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై విపక్ష పార్టీల ఎంపీలు బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ క్రమంలోనే ప్రతిపక్ష ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారితో పాటు పలువురు ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి బస్సుల్లో తరలించారు. దీంతో, పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అయితే, ఓట్ల చోరీ, బీహార్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వంటి వ్యవహారాలపై చర్చించేందుకు తమకు అనుమతినివ్వాలని సీఈసీని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కోరారు. దీంతో, 30 మంది ఎంపీల బృందాన్ని కలిసేందుకు సీఈసీ అనుమతినిచ్చింది. కానీ, తామందరం కలిసే వెళతామని కూటమి ఎంపీలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు.