బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? ప్రజలను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడతారు? ఇదీ.. తెలంగాణలోని పట్టణాల నుంచి గ్రామాల వరకు కూడా వినిపిస్తున్న మాట. ఈ వ్యవహారంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు కూడా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ గత రెండు మూడు వారాలుగా తీవ్రస్థాయిలో హల్చల్ చేస్తున్న అంశాలే కావడంతో ఇటు ప్రజల్లోనూ.. అటు పార్టీ వర్గాల్లోనూ.. కేసీఆర్ ఎప్పుడు వస్తారు? ఆయా విషయాలపై ఎప్పుడు మాట్లాడతారు? ఏం చెబుతారు? అనే ఉత్కంఠ నెలకొంది.
ఆ నాలుగు ఇవీ..
1) బీఆర్ఎస్ విలీనం: గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని.. దీనికి సంబంధించి గత ఏడాదే ప్రతి పాదన కూడా వచ్చిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని బయటి వారో.. లేక పార్టీ ప్రత్యర్థులో చెప్పి ఉంటే.. ఆ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ.. వారితోపాటు.. కేసీఆర్ గారాలపట్టి కవితే.. రెండు మూడు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను జైల్లో ఉన్నప్పుడు.. స్వయంగా తన సోదరుడు కేటీఆరే.. విలీన ప్రతిపాదన చేశారని.. కానీ.. తాను వద్దన్నానని చెప్పారు. ఇక.. తాజాగా పార్టీ నాయకులు కూడా ఇదే మాట వక్కాణిస్తున్నారు. దీంతో అసలు బీఆర్ఎస్ విలీనంపై చర్చ ఎందుకు వచ్చింది? తెరవెనుక ఏం జరిగింది? ఇది నిజమేనా? అనేది.. కేసీఆర్ నోటి నుంచే వినాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది.
2) కవిత వ్యవహారం: తన గారాలపట్టి కవిత.. ఇప్పుడు దూకుడుగా ఉన్నారు. పార్టీలో భాగస్వామ్యం కాదు.. పార్టీనే కావాలని కోరుతున్న కవిత.. అన్నపై అనధికారి.. పరోక్ష యుద్ధమే చేస్తున్నారు. డియర్ డాడీ లేఖ నుంచి ఇప్పటి వరకు ఆమె స్వతంత్రంగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ధర్నాలు చేసినా.. కార్యక్రమాలు చేపట్టినా.. బీఆర్ఎస్ కండువా లేదు. జెండా లేదు. అంతా జాగృతి జెండాలే.. సొంత అజెండాలే. ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై పార్టీ అధిపతిగా కేసీఆర్ వైఖరి ఏంటి? ఓతండ్రిగా ఆయన నిర్ణయం ఎలా ఉందనేది గ్రామ గ్రామానా జరుగుతున్నచర్చ. దీనిపై కూడా ఆయన ఏం చెబుతారన్న విషయంపై ఆసక్తిగా చెవులు రెక్కించి మరీ చూస్తున్నారు.
3) బీసీ రిజర్వేషన్‌పై వైఖరి: తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ రిజర్వేషన్ వ్యవహారం రాజకీయంగా కాక రేపు తోంది. బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధాలు.. పొలిటికల్ ఫైటింగులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు.. దీనిని ప్రతిష్టా త్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి.. మోడీపై నిప్పులు చెరిగారు. కీలకమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు వ్యవహారం పై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు. దీనికి మద్దతు ఇస్తారా? లేక.. ఇవ్వరా? ఇస్తే.. ఎలా? ఇవ్వకపోతే రీజనేంటి? అనే అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తే.. బీసీ సంఘాలుకూడా.. అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
4) కాళేశ్వరం రిపోర్టు: ఇక, రాజకీయ దుమారం రేపిన కీలక అంశం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక. భారీ ఎత్తున అవినీతి జరిగిందని పేర్కొనడమే కాదు.. నేరుగా మాజీ సీఎం కేసీఆరే అంతా చేశారని కూడా కమిషన్ తన రిపోర్టు లో పేర్కొన్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. దీనిపై అసెంబ్లీలోనూ చర్చిస్తామని.. తర్వాత.. ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే.. ఈ నివేదికను.. కాంగ్రెస్‌రిపోర్టుగా పేర్కొంటున్నా.. ఇప్పటి వరకు కేసీఆర్ దీనిపై నేరుగా ప్రస్తావించలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన.. ఈ వ్యవహారంపై కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతారా? అందరూ ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates