సుజనా చౌదరి.. ప్రముఖ పారిశ్రామిక వేత్త.. రాజకీయ నాయకుడు కూడా. 2014-18 మధ్య కేంద్ర మంత్రిగా.. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. ఆయనకు లక్కు కలిసి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆయన 2019 ఎన్నికల తర్వాత.. రాజ్యసభ సభ్యుడిగా ఉండి.. బీజేపీలోకి చేరిపోయారు. ఏదైనా చర్చ జరిగితే.. బీజేపీలో జరగాలి. కానీ.. ఆయన గురించి టీడీపీలోనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
రాజకీయంగా ఆయన ప్రారంభం టీడీపీతోనే కాబట్టి.. ఆయన అనుబంధం కూడా ఈ పార్టీతోనే ఉంది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి గురించి టీడీపీలోనే ఎక్కువగా చర్చ సాగుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న అంచనాలు.. వేస్తున్న లెక్కలను బట్టి.. ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కనుందని సమాచారం. అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. జరుగుతున్న పరిణామాలు.. చర్చలను బట్టి ఔననే సమాధానమే వినిపిస్తోంది. చంద్రబాబుకు సుజనా చౌదరికి రాజకీయంగా కంటే వ్యాపారాల పరంగా కూడా అనుబంధం ఉంది.
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసినప్పుడు.. సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు. అనంతరం ఆయనను రాజ్యసభకు పంపించారు. ఈ బంధం నేటికీ కొనసాగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఈ క్రమంలోనే పెట్టుబడి దారులను మరింతగా ఆకర్షించేందుకు.. పెట్టుబడిదారులకు మరింత విశ్వాసం కల్పించేందుకు సుజనా చౌదరి వంటి బలమైన పారిశ్రామిక వేత్తను మంత్రివర్గంలోకి తీసుకునే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారన్నది తమ్ముళ్ల మాట. దీని వల్ల.. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న లెక్కలు కూడా వేసుకుంటున్నారు.
త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో బీజేపీ మరో సీటునుకోరుతోంది. గత 2014-18 మధ్య బీజేపీ తరఫును దివంగత మాణిక్యాలరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు.. మంత్రులుగా వ్యవహరించారు. ఈ సారి మాత్రం ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ నుంచిరెండో సీటు కోసం డిమాండ్ వస్తోంది. దీనిని ఇచ్చి.. ఇదే సమయంలో పారిశ్రామికంగా రాష్ట్రానికి ప్రయోజనంగా ఉండే.. సుజనాకు అవకాశం కల్పించాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉందని తమ్ముళ్లు చెబుతున్నారు. మరి ఆయనకు లక్కు చిక్కుతుందా? లేదా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates