దేశంలో ఒక్కొక్క‌రిపై 1.32 ల‌క్ష‌ల అప్పు: కేంద్రం

దేశంలో జ‌నాభా ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం.. 142 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. తాజా అంచ‌నాల ప్ర‌కారం.. 142 కోట్ల 9 ల‌క్ష‌ల 30 వేల‌కు పైగానే జ‌నాభా ఉన్నారు. అయితే.. వీరికి ఒక్కొక్క‌రిపై.. ల‌క్షా 32 వేల 59 రూపాయ‌ల చొప్పున అప్పు ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా పార్ల‌మెంటులో వెల్ల‌డించింది. అయితే.. సొమ్మేమీ.. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌లు తీసుకున్న అప్పులో.. లేక బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన రుణాలో కాదు. కేంద్ర ప్ర‌భుత్వం 2014 నుంచి చేసిన అప్పులు.

నాటి నుంచి తీసుకుంటున్న అప్పుల‌ను దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికీ.. చిన్నా, పెద్దా, పురుషుడు, మ‌హిళ అనే తేడా లేకుండా పంపిణీ చేస్తే.. ఒక్కొక్క‌రి త‌ల‌పై 1.32 ల‌క్షల వ‌ర‌కు అప్పు ఉంద‌ని ప్ర‌భుత్వం వివ‌రించింది. అయితే.. ఈ సొమ్మును అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కోస‌మే తీసుకున్నామ‌ని కేంద్రం వెల్ల‌డించడం గ‌మ‌నార్హం. అంతేకాదు.. దీనిలోనే రాష్ట్రాల‌కు కూడా అప్పులు ఇచ్చామ‌ని.. కేంద్రం ఒక్క‌టే ఖ‌ర్చు చేయలేద‌ని వెల్ల‌డించింది. ఈ సొమ్మును దేశ అభివృద్ధి కోసం  అప్పు రూపంలో ప్ర‌పంచ బ్యాంకు స‌హా ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల నుంచి తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఇక‌, ఈ సొమ్ముకు క‌డుతున్న వ‌డ్డీల‌ను కూడా కేంద్రం వెల్ల‌డించింది. పార్ల‌మెంటులో ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌధ‌రి వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..
+ 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో అప్పుల‌కు.. క‌ట్టిన వ‌డ్డీ:  9.30 ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌లు

+ 2023-24లో క‌ట్టిన వ‌డ్డీ:  10.64 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు.

+ 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించిన వ‌డ్డీ:  11.18 ల‌క్ష‌ల కోట్లు.

అయితే, ఈ అప్పుల‌ను 2031 సంవత్స‌రానికి జీడీపీలో 50 శాతానికి తీసుకురావాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. ప్ర‌స్తుతం ఇది జీడీపీలో 62 శాతంగా ఉంద‌ని తెలిపారు. ఇదిలావుంటే.. అప్పులు చేయ‌డాన్ని కేంద్రం స‌మ‌ర్థించుకుంది. “ప‌న్నులు విధిస్తే.. యాగీ చేస్తారు. అప్పులు చేస్తే త‌ప్పంటారు. కానీ.. అభివృద్ధి మాత్రం జ‌ర‌గాలంటారు. ఇదేం చొద్యం. విప‌క్షాల‌కు మైండ్ ప‌నిచేయ‌డం లేదు“ అని త‌న ప్ర‌త్యుత్త‌రంలో మంత్రి వ్యాఖ్యానించారు.