వైసీపీ అధినేత జగన్ ఫ్యామిలీ ప్యాక్ వివాదంలో కీలకమైన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో హైదరాబాద్‌లోని కంపెనీ లా ట్రైబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. ఈ కంపెనీలోని షేర్లను ట్రాన్స్ ఫర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. గతంలో తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేసింది. ఈ మేరకు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ పరిణామం.. జగన్‌కు ఊరటనివ్వగా.. షర్మిల, విజయమ్మలకు ఒకింత షాక్ అనే చెబుతున్నారు న్యాయనిపుణులు.
ఏంటీ వివాదం?
సరస్వతీ పవర్‌లో జగన్.. తనకు ఉన్న వాటాలను.. విజయమ్మకు బదలాయించారు. వాటినే.. గిఫ్టుగా తన సోదరి షర్మిలకు కూడా ఇచ్చారు. అయితే.. అక్రమ ఆస్తుల కేసులో ఈ కంపెనీ కూడా ఉండడంతో సదరు షేర్లపై ఈడీ సీజ్ విధించింది. అంటే.. వీటిని బదలాయించేందుకు.. విక్రయించేందుకు అవకాశం లేదు. ఏదైనా జరిగితే.. అది జగన్ బెయిల్ రద్దుకు దారితీసే పరిణామంగా మారుతుంది. కానీ.. గత ఏడాది ఎన్నికలకు ముందు.. విజయమ్మ .. వాటాగా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించారు.
ఈ బదలాయింపు జరిగితే.. తనకు ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యానికి తోడు.. షర్మిలకు అసలు షేర్లు ఇచ్చే ఉద్దేశం కూడా తనకు లేదని జగన్ చెబుతున్నారు. రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థులతో ఆమె చేతులు కలిపి.. ఇబ్బందికి గురిచేశారని.. కాబట్టి.. ఇప్పుడు ఆమెపై తనకు ప్రేమలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన తల్లి, చెల్లి చేసిన బదలాయింపును నిలుపుదల చేయాలని కోరుతూ.. గత ఏడాది సెప్టెంబరులో కంపెనీ లాట్రైబ్యునల్‌లో కేసు వేశారు.
ఇక, ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకున్న విషయం తెలిసిందే. తల్లిని , చెల్లిని కోర్టుకు లాగారంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇటీవల విజయమ్మ కూడా.. కంపెనీలో వాటాలన్నీ తనవేనని.. జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని వాదనలు వినిపించారు. ఇక, సరస్వతి పవర్ కంపెనీ బోర్డు కూడా.. జగన్ ఎప్పుడో ఈ బోర్డు నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆయనకు కూడా దీంతో సంబంధం లేదని పేర్కొంది. మొత్తంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఈ వ్యవహారంపై తాజాగా మంగళవారం తీర్పు వచ్చింది. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ తీర్పులో వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates