తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం రెడీ అవుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ మేరకు అన్నీ రెడీ చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు 90 రోజుల్లో ఈ ఎన్నికలు పూర్తి కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే.. ఎన్నికలకు వెళ్లాలన్నది.. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం. ఈ క్రమంలోనే రాష్ట్రపతి వద్దకు బిల్లు కూడా చేర్చింది. కానీ.. ఇది ఇంకా ఆమోదం పొందలేదు. ఇంతలోనే ఆర్డినెన్సు కోసం.. గవర్నర్‌కు కూడా పంపించింది.
అయితే.. ఇది కూడా సాకారం కాలేదు. మూడు మాసాల వరకు గవర్నర్‌కు సమయం ఉంది. ఇది ఇటీవల సుప్రీంకోర్టు విదించిన గడువు. సో.. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం చెందుతోంది. కానీ, ఎన్నికల అధికారులు మాత్రం హైకోర్టు తీర్పు.. ఆదేశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అమలు చేయకపోతే.. ధిక్కర నేరం కింద ఇబ్బందులు వస్తాయి. దీంతో సన్నాహాలు ప్రారంభిస్తూ.. తాజాగా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికలప్రధానాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్లూ.. అన్నీ సిద్ధం చేసుకోండి! అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే.. పోలింగ్ కేంద్రాల ఎంపిక, సామగ్రి.. బీఎల్‌వోలు… ఇతర అవసరాలకు సంబంధించిన ఏర్పాట్లపై తమకు 15 రోజుల్లోనే వివరాలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కొక్క జిల్లాల్లో ఎన్ని కేంద్రాలు అవసరం.. సిబ్బంది సంఖ్య ఎంత కావాలి? ఇలా.. అన్ని విషయాలను కూడా తమకు ఇవ్వాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా.. పేర్కొంది.
సెప్టెంబరు 30లోగా ఎన్నికలను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని.. హైకోర్టు ఆదేశాలను కలెక్టర్లు కూడా గుర్తించాలని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఏ చిన్న లోపం లేకుండా ఎన్నికల నిర్వహణకు రెడీ కావాలన్నారు. అయితే.. ఈ వ్యవహారంపై ప్రభుత్వంతోనూ రాష్ట్ర ఎన్నికల అధికారులు సంప్రదించా ల్సి ఉంటుంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని.. ఎన్నికల తేదీలను, షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఏదేమైనా.. రాష్ట్ర అధికారులు రెడీ అయిపోయారు. ఇక, సర్కారుదే లేటన్నట్టుగా వ్యవహారం మారిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates