తెలుగుదేశం అగ్ర నేతల్లో ఒకరైన నారా లోకేష్‌కు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మధ్య కొన్నేళ్ల నుంచి ఎంత మంచి అనుబంధం కొనసాగుతోందో తెలిసిందే. పరస్పరం గౌరవించుకుంటూ, చక్కటి సమన్వయంతో సాగిపోతున్నారు ఈ ఇద్దరు నేతలు. గత ఏడాది ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంలో వీరి మధ్య సమన్వయం కీలక పాత్ర పోషించింది. అధికారంలోకి వచ్చాక కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతుందీ జోడీ. సందర్భం వచ్చినపుడల్లా పరస్పరం గౌరవ భావాన్ని చాటుతూనే ఉన్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ‘హరి హర వీరమల్లు’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో నారా లోకేష్ ముందు రోజు ట్వీట్ పెట్టి పవన్ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. పవన్‌ను ఆప్యాయంగా అన్నా అని పిలుస్తూ ఆ సినిమాకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘‘మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నారా లోకేష్ పేర్కొన్నాడు.
సోషల్ మీడియాలో తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు అనవసర వివాదాల్లో జోక్యం చేసుకుని నిత్యం ఘర్షణ పడుతుంటారు కానీ.. ఆ పార్టీల అగ్ర నేతలు మాత్రం ఎంతో స్నేహంతో మెలుగుతూ ప్రభుత్వాన్ని చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. వారి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు, సమన్వయం గురించి ఎప్పటికప్పుడు ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తున్నా.. సోషల్ మీడియా జనాల మధ్య మాత్రం ఘర్షణ ఆగట్లేదు. ఇప్పటికైనా వాళ్లలో మార్పు వస్తే మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates