తన కామెంట్లలో తప్పే లేదన్న రోజా

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మీద నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. తనను ఎవరు విమర్శించినా దీటుగా బదులిచ్చే రోజా.. ఈ కామెంట్లకు బాగా హర్టయినట్లు కనిపించారు. సాక్షి టీవీలో డిబేట్లో దీని గురించి మాట్లాడుతూ ఆమె బోరున ఏడ్చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఒక మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.

ఐతే టీడీపీ, జనసేన పార్టీల వాళ్లు గట్టిగానే ఎదురు దాడి చేశారు. రోజా గతంలో అదుపు తప్పి మాట్లాడిన, ప్రవర్తించిన వీడియోలన్నీ బయటికి తీశారు. ఇలా మాట్లాడిన రోజా.. ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తోందని.. ఒక మహిళ అయి ఉండి అప్పుడలా ఎలా మాట్లాడిందని ప్రశ్నించారు. ఐతే తాజాగా మరో టీవీ ఛానెల్లో ఒకప్పటి తన కామెంట్లు, వీడియోలన్నింటి మీదా రోజా స్పందించింది.

తాను చేసిన ఏ కామెంట్ విషయంలోనూ ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తన వీడియో ఒక్కొక్కటి ప్లే చేస్తుంటే.. అన్నింటి విషయంలోనూ సమర్థించుకుంటూ ఆమె ఎదురుదాడి చేయడం గమనార్హం. లోకేష్‌ను వాడు, వీడు అని సంబోధిస్తూ పప్పుగాడు అని కామెంట్ చేసిన వీడియో గురించి అడిగితే.. లోకేష్ దొడ్డిదారిలో మంత్రి అయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని.. అందుకే అతణ్ని పప్పు అన్నామని.. అందులో తప్పేముందని రోజా ప్రశ్నించింది. ఇక పవన్‌ గురించి మాట్లాడుతూ గాడిదకు వచ్చినట్లు 55 ఏళ్లు వచ్చాయి, జగన్ వేలి మీద వెంట్రుక కూడా పీకలేవు అంటూ తిట్టిన వీడియోను ప్లే చేస్తే.. పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి గెలవాలని సవాలు విసురుతున్నానని, చంద్రబాబుకు ఊడిగం చేస్తే ఇలాగే మాట్లాడతామని ఆమె తేల్చి చెప్పారు.

ఈ రెండు సందర్భాల్లో తాను వాడిన అభ్యంతరకర భాష గురించి ఆమె రవ్వంత కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఒక మహిళ అయి ఉండి ఇలాంటి భాష ఎలా వాడారు అంటే.. మహిళ అయితే మాట్లాడకూడదా అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యేగా ఉంటూ ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ అనే పాటకు అభ్యంతకర రీతిలో డ్యాన్స్ చేయడం గురించి ప్రత్యర్థి పార్టీల వాళ్లు తప్పుబట్టడంపై ఆమె స్పందిస్తూ.. ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవి, కాజల్‌తో కలిసి ఇవే స్టెప్పులు వేశారని.. మరి ఆయన చేస్తే తప్పు కానపుడు, తాను చేస్తే తప్పేంటని.. తాను నటించిన సినిమా నుంచి ‘నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి’ పాట పాడినా కూడా దాన్ని తప్పుగా చూపిస్తున్నారని.. ఇదేం న్యాయమని రోజా ప్రశ్నించారు.