వైసీపీ రాజంపేట ఎంపీ.. పార్లమెంటరీ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డిని మాస్టర్ మైండ్‌గా పేర్కొంటూ.. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టు వ్యవహారంపై మిథున్‌రెడ్డి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. ఇక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది.
అసలు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన విధానంపైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఏ-4 నింది తుడుగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడానికి కారణమేంటని నిలదీసింది. దీంతో ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తరఫు న్యాయవాది.. ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆలస్యమైందన్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ క్రమంలో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే.. తమ పిటిషనర్ పోలీసుల ముందు లొంగిపోయేందుకు కనీసం 10 రోజుల సమయం కావాలన్న న్యాయవాది వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. అంటే.. ఆయనను ఎప్పుడైనా అరెస్టు చేసేందుకు సిట్ అధికారులకు అవకాశం చిక్కింది. సో.. సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎక్కడ?
ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట హైకోర్టులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ దక్కకపోయే సరికి.. ఆయన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం విదేశాలకు పారిపోకుండా.. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. దీంతో ఆయన ఎక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. అడ్డంగా దొరికి పోవడం ఖాయమని తెలుస్తోంది. సో.. ఈ రోజు లేదా రేపు.. మిథున్ రెడ్డి అరెస్టు ఖాయంగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates