వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు?: సుప్రీంకోర్టు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. త‌మ వాద‌న విన‌కుండా.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకోకుండా.. తాము ఇచ్చిన నివేదిక‌ను కూడా ప‌రిశీలించ‌కుండానే హైకోర్టు బెయిల్ ఇచ్చింద‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున న్యాయ‌వాది సుప్రీంకోర్టుకు వివ‌రించారు. ఈ వాద‌న‌ల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకున్న కోర్టు.. వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు? అంటూ.. హైకోర్టును ప్ర‌శ్నించింది.

ప్రభుత్వం త‌ర‌ఫున వాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంద‌ని.. అలాంటిది అస‌లు వాద‌న‌లే వినకుండా.. ఒక వ్య‌క్తికి బెయిల్ ఎలా ఇస్తార‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఈ నేప‌థ్యంలో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెడుతున్నామ‌ని వ్యాఖ్యానించింది. ఇదేస‌మయంలో వంశీని తిరిగి అరెస్టు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌న్న ప్ర‌భుత్వ వాద‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టి.. కేసులో వాద‌న‌లు వినిపించాల‌ని పేర్కొంది.

తిరిగి ఈ కేసును విచారించాల‌ని.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు కూడా వినాల‌ని హైకోర్టుకు స‌ర్వోన్న‌త న్యాయస్థానం స్ప‌ష్టం చేసింది. నెల రోజుల్లో మ‌రోసారి ప్ర‌భుత్వ వాద‌న‌లు విని.. మ‌రోసారి తీర్పు చెప్పాలని హైకోర్టును ఆదేశించింది. అయితే.. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్ల‌డం లేద‌ని.. పేర్కొంది. ముంద‌స్తు బెయిల్ ఇచ్చేముందు.. కేసు పూర్వాప‌రాల‌తో పాటు.. నిందితుడిపై ఉన్న అభియోగాలు.. పూర్వ చ‌రిత్ర‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సుమారు.. 7 నెల‌ల‌పాటు జైల్లోనే ఉన్నారు. ఆయ‌నపై 6 కేసులు న‌మోద‌య్యాయి. తొలి ద‌ఫా 5 కేసుల్లో ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చింది. ఇక‌, చివ‌రి కేసు.. పేద‌ల‌కు న‌కిలీ ఇళ్ల ప‌ట్టాల‌తో ఇళ్ల‌ను పంపిణీ చేశార‌న్న కేసులో హైకోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చింది. దీనిని రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. తీవ్ర అభియోగాలు ఉన్నాయ‌ని.. అలాంట‌ప్పుడు బెయిల్ ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.