ఏపీ సీఎం చంద్రబాబు అంటే..ఐటీ!. ఐటీ.. అంటే చంద్రబాబు!. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలుగు నేలకు ఐటీని పరిచయం చేసింది ఆయనే. ఈ విషయంలో సందేహం లేదు. సిలికాన్ వ్యాలీ వంటి చోట్ల ఉద్యోగం చేసేవారు.. వారి ఇళ్లలో చంద్రబాబు ఫొటోలు సైతం పెట్టుకున్నామని.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి చంద్రబాబు.. తాజాగా ఐటీ విప్లవం గురించి మాట్లాడుతూ.. ఈ క్రెడిట్‌ను మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు ఇచ్చారు. ఆయన వల్లే దేశంలో ఐటీ విప్లవం వచ్చిందని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ‘లెక్చర్ సిరీస్’ ఆరో ఎడిషన్ కార్యక్రమంలో… ‘లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ’ అనే అంశంపై చంద్రబాబు 40 నిమిషాలకు పైగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా పీవీ నరసింహారావులోని అనేక కోణాలను చంద్రబాబు స్పృశించారు. ఐటీని దేశంలో విస్తృత పరిచిన ప్రధానిగా ఆయనను పేర్కొన్నారు. ఒక విప్లవం తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లు, ఇతరత్రా అన్నింటికీ.. పీవీనే కారణమన్నారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన ప్రధాని పీవీ కారణంగానే నేడు దేశంలో అనేక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని.. దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. లైసెన్స్‌రాజ్ నిబంధనల నుంచి దేశాన్ని బయటకు తెచ్చిన ఘనత కూడా పీవీదేనని చంద్రబాబు చెప్పారు.
పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలతోనే.. దేశంలో గేమ్ ఛేంజింగ్ మొదలైందని చంద్రబాబు తెలిపారు. అదే ఐటీ విప్లవానికి పునాదులు వేసిందన్నారు. మైనారిటీ ప్రభుత్వంలోనూ పీవీ చాలా లౌక్యంగా వ్యవహరించారని చెప్పారు. అయితే.. తర్వాత వచ్చిన ప్రభుత్వం విధ్వంసానికి దిగిన పరిస్థితి ఏపీలో ఉందని.. తాను అమరావతి రాజధానిని ప్రతిపాదిస్తే.. ముందుగా దానికి ఒప్పుకొని తర్వాత.. ధ్వంసం చేశారని ఈ సందర్భంగా చెప్పారు. కానీ, పీవీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నాయకుడు వాజ్‌పేయి పీవీ విధానాలను కొనసాగించారని చెప్పారు. అంతేకాదు.. పీవీ మాదిరిగా.. ప్రస్తుత ప్రధాని మోడీ కూడా.. సంస్కరణలను కొనసాగిస్తున్నారని చంద్రబాబు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates