“నా సంగతేంటి? తేల్చండి!” అంటూ.. మాజీ సీఎం, బీజేపీ నాయకుడు.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యారా? ఆయన ఈ రోజో రేపో ఢిల్లీ బాట పట్టనున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత.. దాదాపు 11 సంవత్సరాలుగా కిరణ్ రాజకీయాలు ఊగిసలడుతూనే ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి పదవినీ ఏ పార్టీలోనూ పొందలేకపోయారు.
రాష్ట్ర విభజనతో సొంత పార్టీ పెట్టుకున్న కిరణ్.. తర్వాత.. దానిని పక్కన పెట్టి.. కాంగ్రెస్ గూటికి తిరిగి చేరారు. కానీ.. అక్కడ కూడా జారుబండపై ప్రయోగాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించి.. బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ఒకానొక దశలో జగన్ పార్టీ వైసీపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానాలు అందాయన్న ప్రచారం జరిగింది. అలానే.. టీడీపీలో చేరతారని కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఆయన సోదరుడు కిశోర్ కుమార్ మాత్రం టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యే.
ఇక, కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి మాత్రం డోలాయమానంగానే ఉంది. ఆయనకు గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చినా.. కూటమి మద్దతు ఉన్నా.. ఓడిపోయారు. ఆ తర్వాత.. ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ పగ్గాలు ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, సమీకరణలు కుదరలేదు. ఇక, గవర్నర్ పోస్టుల భర్తీలో అయినా.. ప్రాధాన్యం ఉంటుందని.. చెప్పారు. “ఏమో పెద్ద పదవి దక్కొచ్చు” అని పీలేరు పర్యటనలో రెండు మాసాల కిందట కిరణ్ వ్యాఖ్యానించారు. కానీ ఆ పెద్ద పదవీ దక్కలేదు.
ఇక, రాజ్యసభకు వెళ్లాలని ఉన్నా.. ఇప్పట్లో ఈ కథ కూడా తెరమీద లేదు. ఉన్న నాలుగు స్థానాలను వేర్వేరు వ్యక్తులకు ఇస్తూ.. ఇటీవలే రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఇన్ని పరిణామాలతో కనుచూపు మేరలో తనకు ఎక్కడా పదవి దక్కే అవకాశం లేదని భావించిన కిరణ్ కుమార్‌రెడ్డి ఈ విషయంపై కేంద్ర బీజేపీ పెద్దల వద్దే తేల్చుకునేందుకు హస్తిన పయనమవుతున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కూర్పు జరుగుతున్న నేపథ్యంలో బహుశ ఈ పదవిపై కిరణ్ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates