మాట నిలబెట్టుకున్న పవన్ అన్నియ్య

ఏపీలోని గిరిజన ప్రాంతాలలో ప్రజలకు అనారోగ్యం వస్తే చాలు గుండెల్లో గుబులు మొదలవుతుంది. అడవులు, కొండలు, వాగులు, వంకలు, డొంకలు దాటుకుంటూ డోలీలో రోగిని మోసుకు పోవాలన్న ఆలోచన వస్తే చాలు వారు వణికిపోతుంటారు. ఇక, గర్భిణుల పరిస్థితి అయితే అగమ్య గోచరం. డోలీలో మోసుకుపోతున్న సమయంలోనే వారు అనుభవించే ప్రసవ వేదన వర్ణనాతీతం. దశాబ్దాలుగా ఆదివాసీలు, గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాలలోని ప్రజలు పడుతున్న అవస్థలు చూసిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. అరకులోని ఏజెన్సీ ప్రాంతం నుంచి డోలీలలో గర్భిణులను మోసుకువెళుతున్న వైనం చూసిన పవన్ ఆవేదన చెందారు.

ఆ పరిస్థితులు పోవాలని, అందుకు తనవంతు కృషి చేస్తానని పవన్ అక్కడి ఆడబిడ్డలకు మాటిచ్చారు. అందరు రాజకీయ నాయకుల మాదిరిగా మాటిచ్చి మరిచిపోలేదు పవన్. మాట మీద నిలబడి అరకులోయ మండలంలోని రేగ గ్రామానికి పవన్ రోడ్డు వేయించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించిన పవన్ అన్నియ్యకు అరకు లోయలోని ఆడపడుచులు రుణపడి ఉంటామని చెబుతున్న వీడియో వైరల్ గా మారింది. డోలీల బాధ తప్పించి రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

పవన్ చొరవతో వేసిన తారు రోడ్డుపై ప్రయాణించి ఆసుపత్రికి వెళ్లి వస్తున్నామని గర్భిణులు, బాలింతలు ఆనందభాష్పాలతో చెబుతున్నారు. అంబులెన్సుకు ఫోన్ చేసినా ఈ మారుమూల ప్రాంతానికి వచ్చేది కాదని, ఇప్పుడు రోడ్డు పడడంతో తమ కష్టాలు తీరిపోయాయని సదరు మహిళల భర్తలు చెబుతున్నారు.