చేసిన పాపం ఊరికే పోదంటారు పెద్దలు. కళ్ల ముందు కనిపిస్తున్న కొన్ని విషయాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు కూడా. రాజకీయాల్లో ఎప్పుడు చేసిన పాపం.. అప్పుడే పేరుకుని.. అనంతర కాలంలో అనుభవించేలా చేస్తోందని కూడా చెబుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయనను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.
గనుల కేసులో నెల్లూరు జైల్లో ఉన్న కాకాణిని.. ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. ఇది కూడా.. 2024 నాటి కేసు కావడం గమనార్హం. అప్పటి ఎన్నికల్లో ప్రజలకు మద్యం పంచేందుకు.. నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేందుకు కాకాణి .. ఓ రహస్య ప్రాంతంలో మద్యాన్ని నిల్వ చేశారన్నది కేసు సారాంశం. ఈ కేసునే ఇప్పుడు తిరగదోడి.. ఎక్సైజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిలోనూ ఆయన అరెస్టయితే.. మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే.
అయితే.. సాధారణంగా ఎన్నికల సమయంలో నాయకులు ఎవరూ మందు పంపిణీ చేయలేదా? ఒక్క కాకాణి మాత్రమే మద్యం పంపిణీ చేశారా? అనే డౌటు రావొచ్చు. నిజమే దాదాపు 95 శాతం మంది నాయకులు.. మద్యం పంపిణీ చేశారని ఏడీఆర్ రిపోర్టే వెల్లడించింది. కాబట్టి.. కాకాణి దీనికి అతీతులు కారు. కానీ… ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలే ఇప్పుడు వెంటాడుతున్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై.. అక్రమ మద్యం (హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించారని) కేసులు పెట్టించారన్న వాదన ఉంది.
ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(ప్రస్తుత ఎమ్మెల్యే) అనుచరుల పై కాకాణి అప్పట్లో కసి తీర్చుకు న్నారని టీడీపీ నాయకులు ఇప్పటికీ చెబుతారు. ఈ పాపమే ఇప్పుడు కేసుల రూపంలో కాకాణిని వెంటాడు తోందన్నది టీడీపీ నాయకుల మాట. ఏదేమైనా.. చేసుకున్న పాపం.. అనుభవించాల్సిందేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates