ఔను.. నిజమే.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిందే!. టీడీసీ సానుభూతి పరుల నుంచి సీనియర్ల వరకు ఈ మాటే వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆదేశాలతో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో నాయకులు ప్రజలను కలుస్తున్నారు. అయితే.. కొందరు నాయకులు ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే.. మెజారిటీ నాయకులు చాలా కష్టంగా నిర్వహిస్తున్నారు. సమయం చూసుకుని.. ఓ గంటో రెండు గంటలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని మమ అనిపిస్తున్నారు. ఇంకొందరు నాయకులు చాలా తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు.
వారు ఆయా కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొనకపోయినా.. ఫొటోలు, వీడియోలను ఇంటి దగ్గరే తీసేసి అప్‌లోడ్ చేస్తున్నారట. అంటే.. సదరు ఎమ్మెల్యేలు ఎంపీలు.. వారు నేరుగా ప్రజల వద్దకు వెళ్లరు. ప్రజలనే వారి ఇళ్ల వద్దకు రప్పించుకుని క్లోజ్ షాట్‌లో ఫొటోలు తీసేసి.. వీడియో తీయించి సోషల్ మీడియాలో అప్‌లో డ్ చేస్తున్నారట. ఇక, ఇంకొందరు.. సభలు సమావేశాలు నిర్వహించి(అంటే ఇంటింటికీ వెళ్లకుండా) కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు. వీరి విషయంపై శనివారం పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. వారి సంగతి ఏంటనేది చంద్రబాబు కూడా ఆరా తీస్తున్నారు.
ఇదిలావుంటే.. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం హైలెట్‌గా నిలిచారు. ఆయన ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ఎక్కడా మందీ మార్బలంతో హడావుడి చేయడం లేదు. అంతేకాదు.. మేళతాళాలతో ఊరేగింపులు కూడా నిర్వహించడం లేదు. చంద్రబాబు చెప్పిన అజెండాకు మరికొంత తన పరిజ్ఞానం జోడించి.. ప్రజలను కలుస్తున్నారు. అంతేకాదు.. వారికి అర్ధమయ్యేలా ఏడాది పాలనపై స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు. దీంతో కోటంరెడ్డి ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచారు.
ఎలా చేస్తున్నారంటే..
నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్తున్న కోటం రెడ్డి.. ముందుగా వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీస్తున్నారు. వారి నోటితోనే.. వారికి ఎన్నిక పథకాలు వచ్చాయో చెప్పిస్తున్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉంటే..వారందికీ.. తల్లికి వందనం కింద రూ.13000 చొప్పున ముగ్గురికి అందాయని చెప్పిస్తున్నారు. అదేవిధంగా ఆ ఇంట్లో అందే పింఛన్ల లెక్కను కూడా వారితోనే చెప్పిస్తున్నారు. అనంతరం.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఒక కుటుంబానికి ఎంత మేలు జరిగిందో లెక్కలతో సహా వివరిస్తున్నారు. వారితోనూ చెప్పిస్తున్నారు.
అంతటితో ఆగకుండా.. ఆ వీధి గతంలో వైసీపీ హయాంలో ఎలా ఉండేదో ఫొటోలను చూపించి.. ఇప్పుడు ఎలా ఉందో పోల్చి చూపిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీబస్సులు వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా అందుతాయని వివరిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తమకు అందుతున్న ఫలాలను లెక్క వేసుకుని మురిసిపోతున్నాయి. ఇలా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి మనసు పెట్టి చేస్తుండడంతో చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యం ప్రజలకు చేరువ అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అందరూ ఇలా చేస్తే బాగుంటుందని సీనియర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates