వైసీపీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్

తప్పు చేసిన వైసీపీ నేతలు ఈ రోజు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటూ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఆ విషయం వదిలేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి పార్టీల నేతలపై రివేంజ్ తీర్చుకుంటామని వార్నింగులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

2029లో మళ్ళీ వస్తే అంతు చూస్తామని వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారని, అలా అంతుచూడాలంటే వైసీపీ అధికారంలోకి రావాలి కదా అని ప్రశ్నించారు. అసలు, వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో తామూ చూస్తామని పవన్ చెప్పారు. గతంలో వైసీపీ ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసిందని, అవన్నీ తట్టుకునే ఈ స్థాయికి వచ్చామని పవన్ చెప్పారు.

వైసీపీ మీద తనకు వ్యక్తిగతంగా కక్ష లేదని అన్నారు. వైసీపీ సుపరిపాలన అందిస్తే 11సీట్లు వచ్చేవి కాదు కదా అని చురకలంటించారు. తప్పు చేస్తే శిక్షించే ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే చెప్పాలని, తాము వింటామని అన్నారు. గత ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారని, ప్రజలకు మంచినీరు అందించాలన్న ధ్యాస కూడ గత పాలకులకు లేదని చెప్పారు..

వైసీపీ హయాంలో 4వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని, కూటమి ప్రభుత్వం కృషి, కేంద్ర సహకారంతో ప్రకాశం జిల్లాలోని నరసింహాపురంలో అతి పెద్ద తాగునీటి పథకం ఏర్పాటైందని అన్నారు. వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు శిలాఫలకాలు వేసేందుకే పరిమితమయ్యారని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం అలా కాదని, 18 నుంచి 20 నెలలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకమిదేనని, 10 లక్షలకు పైచిలుకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని అన్నారు.